
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం మాజీ క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ మెన్ అండ్ వుమెన్ క్రికెటర్లు, మరియు మాజీ అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక ఈ పెంపు అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'మాజీ ఇండియన్ ప్లేయర్ల ఆర్థిక పరిస్థితి చాలా ముఖ్యం. మా మాజీ క్రికెటర్ల ఆర్థిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆటగాళ్లు లైఫ్‌లైన్ లాంటోళ్లు. వారి క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత వారికి అండగా ఉండడం బోర్డుగా మా కర్తవ్యం. ఇక అంపైర్లు సైతం అన్ సంగ్ హీరోలు. క్రికెట్లో వారు అందించిన సహకారానికి బీసీసీఐ నిజంగా వారికి విలువనిస్తుంది' అంటూ గంగూలీ పేర్కొన్నాడు.
బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా మాట్లాడుతూ..'మాజీ క్రికెటర్లు అయినా, ప్రస్తుత క్రికెటర్లు అయినా వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మా డ్యూటీ. ఇందులో భాగంగా వారికి అందే పెన్షన్ మొత్తాలను పెంచనున్నాం. సంవత్సరాలుగా అంపైర్లు అందించిన సహకారాన్ని బీసీసీఐ విలువైనదిగా పరిగణిస్తుంది. భారత క్రికెట్‌కు వారు శ్రద్ధతో చేసిన సేవలకు మా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇదో మార్గంగా భావిస్తున్నాం. మొత్తం 900మంది ప్లేయర్లు, అంపైర్లు ఈ పెంపు ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇక ఇందులో 75శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు 100% పెన్షన్ పెంపు అందుకోనున్నారు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నా' అని జై షా పేర్కొన్నారు.
బీసీసీఐ గౌరవ కోశాధికారి మిస్టర్ అరుణ్ సింగ్ ధుమాల్ మాట్లాడుతూ.. 'ఈ రోజు బీసీసీఐ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం.. ఇండియన్ మాజీ క్రికెటర్లు, అంపైర్ల అందించిన హితోదిక సహకారమే. మా మాజీ క్రికెటర్ల శ్రేయస్సు కోసం నెలవారీ పెన్షన్‌ల పెంపును ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం.' అని అరుణ్ సింగ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం రూ.15వేల పెన్షన్ అందుకునేవారికి ఇక రూ.30వేల పెన్షన్ అందనుంది. రూ.22,500 పెన్షన్ అందుకునేవారికి రూ.45,000, రూ.30వేల పెన్షన్ అందుకునేవారికి రూ.52,500, రూ.37,500 పెన్షన్ అందుకునే వారికి రూ.60వేలు, రూ.50వేలు అందుకునేవారికి రూ.70వేల పెన్షన్ ఇక నుంచి అందనుంది. ఈ పెన్షన్ పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.