
హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఒకొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్నారు. మ్యాచ్ ఆరంభంలో మొదటి బాల్ కే డికాక్ ఔట్ అవ్వాల్సింది. అదృష్టం కలిసిరావడంతో కాస్త సమయం పట్టింది.
గత గురువారం డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో ఔటవకపోయినా.. అంపైర్ తప్పు నిర్ణయంతో వికెట్ చేజార్చుకున్న డికాక్.. రెండో వన్డేలో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతని బ్యాట్‌ను తాకిన బంతి అనంతరం దొర్లుకుంటూ వెనక్కి వెళ్లి దాదాపు వికెట్లని తాకేలా కనిపించింది. కానీ.. డికాక్ అదృష్టం అడుగు దూరంలో బంతి నిలిచిపోయింది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా తొలి బంతినే ఔట్‌సైడ్ ఆఫ్‌గా విసిరాడు. దాన్ని డిఫెన్స్ చేసేందుకు డికాక్ ప్రయత్నించగా.. ఎడ్జ్ తాకిన బంతి క్రీజులోనే అతని కాళ్లవద్ద పడి వికెట్ల వైపు దొర్లుతూ వెళ్లసాగింది. దీంతో కంగారుపడిన డికాక్.. దాన్ని కాలితో పక్కకి తోసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
అప్పటికే వికెట్ల సమీపానికి బంతి వెళ్లడంతో.. ఇక తాను ఔటనుకుని రెండో ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాడు. అయితే దొర్లుకుంటూ అలానే వెళ్లిన బంతి వికెట్లకి అరడుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో డికాక్ ఊపిరిపీల్చుకున్నాడు. కానీ, అప్పటికే ఔటనుకుని ఆనందపడిన భారత ఫీల్డర్లు నిరాశతో నిట్టూర్చారు.
మ్యాచ్‌లో డికాక్ ఎదుర్కొన్న తొలి బంతే ఔటై ఉంటే గోల్డన్ డక్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. కానీ, కలిసొచ్చిన అవకాశాన్ని డి కాక్ 12.6 ఓవర్ల వరకే ఆపకోగలిగాడు. పన్నెండో ఓవర్లో చాహల్ వేసిన బంతిని ఎదుర్కోబోయిన డికాక్ ఔట్ అయ్యాడు. హార్థిక్ పాండ్యా క్యాచ్ పట్టడంతో చాహల్ అకౌంట్లో మొదటి వికెట్ నమోదైంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.