హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆటగాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ భారత స్టార్ ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. యువ ఆటగాళ్లకు కోహ్లీ ఒక రోల్ మోడల్ అంటూ కొనియాడాడు.
అంతేగాక, 'తాను క్రిస్ గేల్, డివిలియర్స్ లాంటి ఆటగాడిని కాదని కోహ్లికి తెలుసు. ఐతే అతనికంటూ ఓ ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలి ఉంది. కవర్స్, మిడ్‌వికెట్ మీదుగా కోహ్లీ ఆడే స్ట్రోక్‌లు అద్భుతం. కళాత్మకంగా ఆడుతూ భారీగా పరుగులు సాధిస్తుండటం గొప్ప విషయం. కోహ్లి బ్యాటింగ్ నుంచి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చు' అని పేర్కొన్నాడు.
భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్, శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌లు మార్గనిర్దేశకుడిగా, కోచ్‌గా లభించడం గొప్ప గౌరవమని చెప్పాడు. మురళీధరన్‌కు ఆట పట్ల అపార జ్ఞానముందని తెలిపాడు.

'లక్ష్మణ్ చాలా గౌరవనీయ వ్యక్తి. నన్నెప్పుడూ సహజసిద్ధంగా ఆడమని చెబుతుంటాడు. ఆ రోజుల్లో వాళ్లెంతో ఓపికతో ఆడారు. దేశానికి ఆడుతున్నప్పుడు కూడా ఇలాంటి విషయాలు నేర్చుకోలేం. టీ20 క్రికెట్‌తో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు మళ్లీ ఆటలో అడుగుపెడుతుండటం శుభపరిణామం' అని వార్నర్ పేర్కొన్నాడు.
భారత మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లు కలిసి 60- 70 వేల పరుగులు చేశారని.. వారితో కలిసి ఆడటం, మాట్లాడటం గొప్ప గౌరవమని తెలిపాడు. చాలామంది వ్యాఖ్యాతలుగా వస్తున్నారనీ, ఆటకు గుడ్‌బై చెప్పాక క్రికెట్‌కు ఏదైనా చేయడానికి ఇదో మంచి అవకాశమని చెప్పాడు.
'టీ20 క్రికెట్ సరదా ఆట. ఎంతోమంది యువ ఆటగాళ్లకు వేదికగా నిలుస్తుంది. ఐతే ప్రతి ఆటగాడి కెరీర్‌లో టెస్టులు, వన్డే ప్రపంచ కప్‌లే అత్యున్నతం. టెస్టు క్రికెట్ అన్నింటికంటే విశిష్టమైనది. అందుకే ప్రతి ఒక్కరు టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలని కోరుకుంటారు. టెస్టులు బాగున్నపుడే వన్డే, టీ20 ఫార్మాట్లు బతుకుతాయి' అని వార్నర్ విశ్లేషించాడు.
మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించడం కోసం తాను ఎంతో శ్రమిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. ఫార్మాట్ ఏదైనా పరుగులు సాధించడమే విజయ రహస్యమని తెలిపాడు. చాలామంది ఆటగాళ్ళు షాట్లు ఆడేందుకు ఓపికగా ఎదురు చూస్తారని, కానీ తాను మాత్రం ప్రతి బంతికి పరుగులు రాబట్టాలనే కోరుకుంటానని చెప్పాడు.
ఎప్పట్నుంచో ఈ శైలిని అలవర్చుకున్నట్లు తెలిపాడు. తన దృష్టిలో సారథ్యం చాలా కష్టంతో కూడుకున్న బాధ్యత అని పేర్కొన్నాడు. ఆటగాడు తన ప్రదర్శన వరకు పరిమితమవుతాడని, అయితే కెప్టెన్ మాత్రం తను ఆడుతూ.. అందరి ఆట గురించి ఆలోచించాలన్నారు.
అంతేగాక, జట్టును ముందుండి నడిపించాలని తెలిపాడు. అందరినీ కలుపుకుని పోవాలని, సారథికి దృఢమైన వ్యక్తిత్వం ఉండాలని చెప్పాడు. కెప్టెన్సీ పెద్ద సవాలేనని వార్నర్ తెలిపాడు. అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, న్యూజిలాండ్ సారథి విలియమ్సన్‌లు ఉన్న జట్టుకు సారథ్యం వహించడం భిన్నమైన అనుభూతిస్తోందని వార్నర్ పేర్కొన్నాడు. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు.
కాగా, తన కెప్టెన్‌లలో స్టీవ్ స్మిత్ అత్యుత్తమమని స్పష్టం చేశాడు. ఆటపై అతడికి మంచి పట్టుందని, చురుకైన వ్యక్తని కొనియాడాడు. అంతేగాక, వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడని.. అందరితో కలుపుగోలుగా ఉంటాడని తెలిపాడు. స్మిత్‌లో నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయని, అన్నిటికంటే అతనో గొప్ప బ్యాట్స్‌మన్ అని ప్రశంసించాడు.
వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. తనకు ఇద్దరు అందమైన కూతుళ్లు ఉన్నారని వార్నర్ తెలిపాడు. తన భార్య తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తని తెలిపాడు. ఆమె తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందని డేవిడ్ వార్నర్ చెప్పాడు.