
హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్. వన్డే వరల్డ్‌కప్‌లో తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించిన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో మళ్లీ అద్భుతం చేశాడు.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో బెన్ స్టోక్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. 11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు.
టెస్టు క్రికెట్‌లో చివరి వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మీడియా బెన్ స్టోక్స్‌ను ఆకాశానికెత్తేసింది. హీరో అంటూ అతడి ఇన్నింగ్స్‌పై పెద్ద పెద్ద కథనాలను ప్రచురించగా... ఆస్ట్రేలియా మీడియా మాత్రం మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది.
ప్రఖ్యాత ది టైమ్స్ పత్రిక "Stokes leads England to epic Ashes comeback" అంటూ కథనాన్ని ప్రచురించగా... ది డైలీ టెలిగ్రాఫ్ మాత్రం "Howzat" అంటూ స్టోక్స్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ది సన్ పత్రిక యాషెస్ కప్ కోసం వెళ్లండి అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇక, డైలీ మెయిల్ పత్రిక అయితే "land of Heat and Glory" అంటూ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్‌పై కొనియాడింది. మరోవైపు ఆస్ట్రేలియా మీడియా మాత్రం కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్ నిర్ణయం వల్లే ఇంగ్లాండ్ గెలిచిందంటూ పేర్కొంది. స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు.
ది ఆస్ట్రేలియన్ పత్రిక మాత్రం బెన్ స్టోక్స్ గోస్ట్ బోథమ్‌ను గుర్తుకు తెచ్చడాంటూ తెలిపింది. 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఒకానొక దశలో చేసిన పరుగులు 286/9. ఇంగ్లాండ్ అభిమాని సైతం కలలోనైనా ఊహించి ఉండడు తమ జట్టు గెలుస్తుందని, కానీ, బెన్ స్టోక్స్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
ఆఖరి బ్యాట్స్‌మన్ లీచ్‌ను కాపాడుకుంటూ, కంగారూలకు షాకిచ్చాడు. స్టోక్స్ రాణించడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. యాషెస్ నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి జరుగుతుంది.