
కెనడా: వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి నిరూపించాడు. 'గ్లోబల్ టీ20 కెనడా' లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల అఫ్రిది కేవలం 40 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పాడు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న షాహిద్ అఫ్రిది పలు టీ20 లీగ్‌లలో ఆడుతున్న విషయం తెలిసిందే.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
టీ20 కెనడా లీగ్‌లో భాగంగా ఆదివారం బ్రాంప్టన్ వోల్వ్స్, ఎడ్మొంటన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో బ్రాంప్టన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బ్రాంప్టన్ నిర్ణీత 20 ఓవర్లలో 207 భారీ స్కోర్ చేసింది. సిమన్స్ 34 బంతుల్లో 59 పరుగులు చేసాడు. అఫ్రిది ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ బంతిని ఈజీగా స్టేడియం బయటికి పంపాడు. క్రీజులోకి వచ్చిన ఆఫ్రిదిని రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అఫ్రిది 81 (40 బంతుల్లో; 10 ఫోర్లు, 5 సిక్సులు) అర్ధ సెంచరీ చేయడంతో బ్రాంప్టన్ భారీ స్కోర్ చేసింది. రాయల్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు, బెన్ కట్టింగ్ రెండు వికెట్లు తీసాడు.
లక్ష్య ఛేదనలో రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. రిచీ బెర్రింగ్టన్ (28), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (21), జేమ్స్ నీషామ్ (33), షాదాబ్ ఖాన్ (27) పరుగులు చేసినా రాయల్స్ విజయాన్ని అందుకోలేకపోయింది. బ్రాంప్టన్ బౌలర్లలో జహూర్ ఖాన్, ఇష్ సోధి తలో మూడు వికెట్లు తీశారు. వహాబ్ రియాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అఫ్రిది కూడా ఒక వికెట్ తీసాడు. బ్యాట్, బంతితో మెరిసిన షాహిద్ అఫ్రిది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.