
సిడ్నీ: పితృత్వ సెలవులతో సుదీర్ఘ ఆస్ట్రేలియా సిరీస్‌లోని చివరి మూడు టెస్టులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వడం స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు కలిసొస్తుందని ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్లలో ఎన్నో ఘనతలు సాధించిన హిట్‌మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో పెద్దగా సత్తాచాటలేదని, కోహ్లీ గైర్హాజరీతో ఆ లోటును తీర్చుకుంటాడన్నాడు. మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియా తరఫున 124 టెస్టులు, 250 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
గ్లెన్ మెక్‌గ్రాత్ తాజాగా స్పోర్ట్‌స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ నాణ్యమైన బ్యాట్స్‌మన్. కానీ టెస్టుల్లో గొప్పగా ఏమీ సాధించలేదు. ఈ సారి తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లడం రోహిత్‌కు కచ్చితంగా కలిసొస్తుంది. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ మాత్రమే రాణిస్తాడని భావించలేం. అజింక్య రహానె, ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్‌తో భారత్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరిలో ఎవరైనా ఆస్ట్రేలియా సిరీస్‌లో తమదైన ముద్ర వేయొచ్చు. అది రోహిత్ చేస్తాడని భావిస్తున్నా' అని అన్నాడు.

తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి రానున్న విరాట్ కోహ్లీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోహ్లీ ఇలా పెటర్నిటీ సెలవులు తీసుకొని మిగతా మూడు టెస్టులకు గైర్హాజరవడం జట్టుకు ప్రతికూలంగా మారుతుందని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ స్పందిస్తూ... 'నిజం చెప్పాలంటే కోహ్లీ గురించి ఇప్పటికే చాలా మాట్లాడేశాం. ఫస్ట్ టెస్టు తర్వాత కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం వల్ల మా విజయాల్లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే టీమిండియా కోహ్లీకి బదులుగా మరో అద్భుతమైన బ్యాట్స్‌మన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తుది జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది అవకాశంగా మారొచ్చు. ఇది మరో క్రికెటర్ కెరీర్ ప్రారంభించడానికి ఉపయోగపడొచ్చు' అని చెప్పాడు.
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో.. టీమిండియా కెప్టెన్ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.