హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌కు ఆస్ట్రేలియా జట్టు స్లెడ్జింగ్ అనే పేరుని పరిచయం చేసింది. ఏదైనా దేశానికి పర్యటనకు వెళ్లినా, ఏ క్రికెట్ జట్టైనా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినా ముందుగా నోటికి పని చెప్పడం అలవాటుగా మార్చుకుంది. ప్రత్యర్ధి జట్టులోని ఆటగాళ్లపై మాటల యుద్ధానికి దిగి పైచేయి సాధించేది.
అయితే ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో ఆసీస్ జట్టు కుదేలైంది. మరోవైపు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు కోహ్లీ సేనతో స్లెడ్జింగ్ అంటే భయపడుతోంది. కోహ్లీ సేనతో స్లెడ్జింగ్‌కు దిగితే, తమకే నష్టమని ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్‌లు అభిప్రాయపడ్డారు.
ఇందులో భాగంగా సాధ్యమైనంత వరకూ కోహ్లీతో మాటల యుద్ధానికి దిగకుండా కేవలం ఫీల్డ్ అటాక్‌కే పరిమితం కావాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు యోచిస్తున్నారు. కోహ్లీతో స్లెడ్జింగ్ చేసి నష్ట పోయేకంటే కామ్‌గా ఉండటమే మేలని మ్యాక్స్ వెల్ అభిప్రాయపడ్డాడు. కోహ్లితో స్లెడ్జింగ్‌కు దిగే సాహసం చేయనని స్పష్టం చేశాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో 'కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్‌లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే' అని మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు.
ఇక, వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్నాళ్లుగ కోహ్లీ ఆటతీరుని గమనిస్తున్నామని, ఓ అత్యుత్తమ క్రికెటర్‌గా కోహ్లీ ఎదుగుతున్న అమోఘమని కొనియాడాడు.
ఇదిలా ఉంటే కోహ్లీపై నోరు పారేసుకోవడం అనే అంశాన్ని పక్కను పెట్టి, ఆటపై దృష్టిసారించాలని ఆసీస్ దిగ్గజ ఆటగాడు మైక్ హస్సీ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియా ఏతో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది.