హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత పర్యటనకు వస్తున్న ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు నుంచే పాఠాలు చేర్చుకోవాలని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. టీమిండియా జరిగే టెస్టు సిరిస్ ప్రతి ఒక్క ఆటగాడికి నిజమైన టెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత్‌లోని పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్న మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో ఆరో స్ధానంలో బరిలోకి దిగనున్నాడు. భారత పర్యటనలో తమ జట్టు విజయం సాధించాలంటే ప్రధానంగా స్పిన్‌ను ఎదుర్కోవడంపై ఎక్కువ కసరత్తు చేయాలని పేర్కొన్నాడు.

ఉపఖండంలోని పిచ్‌లపై రాణించడం అంత సులభం కాదని, అక్కడ పిచ్‌లను అర్థం చేసుకుని ఆధిక్యం సాధించాలంటే విపరీతంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పాడు. స్పిన్‌ను ఎదుర్కునే విషయంలో కోహ్లీ సేనను చూసి నేర్చుకోవడం మంచిదని పేర్కొన్నాడు.
'భారత్‌లోని పిచ్‌లపై రాణించాలంటే స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడమే మార్గం. ఆ స్పిన్‌ను ధీటుగా ఎదుర్కోవాలంటే భారత బ్యాట్స్‌మెన్‌లు ఎలా ఆడుతున్నారో చూసి నేర్చుకోవాలి. ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు బ్యాక్ ఫూట్ వేసి స్పిన్‌ను ఆడటాన్ని చూసి నేర్చుకుందాం' అని మ్యాక్స్ వెల్ తెలిపాడు.
అంతేకాదు భారత్‌లోని పిచ్‌లు తమకు అనుకూలంగా ఉంటయని తాను కచ్చితంగా చెప్పలేనని అన్నాడు. ఒక్కసారి మన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ ఆపై వెంటనే చేజారిపోవడాన్ని భారత్ పిచ్‌ల్లో అనేకసార్లు జరిగిన విషయాన్ని మ్యాక్స్ వెల్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
'ఈ పిచ్‌లపై పరుగులు చేయాలంటే బాగా కష్టపడాలి. ఆటలో వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వ్యూహాలు అమలు చేయాలి' అని మాక్స్‌వెల్ అన్నాడు. ఇన్నింగ్స్ మధ్యలో ఆటలో మార్పులు చేసుకోవడం తాను ఇక్కడే నేర్చుకొన్నానని తెలిపాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టు ఫిబ్రవరి 23న పూణెలో ప్రారంభం కానుంది.