బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరపున ఆడుతున్న గ్లెన్ మాక్స్‌వెల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆల్‌రౌండర్ షోతో సత్తాచాటుతున్నాడు. మంగళవారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్ మ్యాన్ షోతో మాక్సీ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ బంతితో సత్తాచాటాడు. మూడు ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రెనెగేడ్స్ ఆది నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డికాక్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్వే (18), జేక్ (14), టామ్ రోజర్స్ (10) పరుగులు చేశారు. స్టార్స్ జట్టులో లారెన్స్ రెండు వికెట్లు, జోయెల్, వసీమ్, స్టెకెటీ, వెబ్‌స్టెర్, మాక్సీ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనకు వచ్చిన మెల్‌బోర్న్ స్టార్స్ రెండు వికెట్లు కోల్పోయి 12.1 ఓవర్లలో విజయం సాధించింది. ఓపెనర్ లారెన్స్ (7), వెబ్‌స్టర్ (14) విఫలమయ్యారు. మరో ఓపెనర్ రోజర్స్ (46*; 34 బంతుల్లో)తో కలిసి మాక్స్ వెల్ (32*; 15 బంతుల్లో) రెనెగేడ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అయితే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ ఆడిన ఓ షాట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్కూప్ షాట్ ఆడుతున్నట్టుగా బౌలర్‌ను నమ్మించి ఆఖరి క్షణంలో స్లిప్ మీదుగా బౌండరీ సాధించాడు. వినూత్న షాట్లకు ఎప్పుడూ ట్రై చేసే మాక్స్‌వెల్ మరో షాట్ అద్భుతంగా ఆడాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బౌలర్లపై దయ చూపాలని, కాస్త మనిషిలా మంచి మనసుతో ఆలోచించాలని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.