IPL 2025: ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు. ఆ ఫ్రాంచైజీ తన అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది. అలాంటి ఒక ఆటగాడు ఉన్నాడు. అతను వేలంలోకి వచ్చినప్పుడల్లా పెద్ద బిడ్ వేయబడుతుంది. ఆ ఆటగాడి పేరు గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఈ సారి వేలంలో పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌ను రూ.4 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్ పూర్తిగా విఫలం
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2025లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మ్యాక్స్‌వెల్ కు 6 మ్యాచ్‌లలో 5 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ 6 మ్యాచ్‌లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 8.2 సగటుతో కేవలం 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మ్యాక్స్‌వెల్ స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టగలిగాడు. ఈ మ్యాచ్ లలో మ్యాక్స్‌వెల్ చేసిన అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే. అంటే మిగిలిన 4 ఇన్నింగ్స్ లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్స్‌వెల్ తన బౌలింగ్ లో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శనపై న్యూజిలాండ్ వ్యాఖ్యాత సైమన్ డౌల్ మాట్లాడుతూ.. మ్యాక్స్‌వెల్ కు చాలా అవకాశాలు వచ్చాయని.. కానీ ప్రస్తుతం అతను ఔట్ అవుతున్న తీరు ఒక కోచ్ గా తనను నిరాశపరుస్తోందన్నాడు. ఇది నిరాశపరిచే విషయం అని తాను అనుకుంటున్నానన్నాడు. కాబట్టి ఆల్ రౌండర్ ఒమర్జాయ్ అతడి స్థానంలోకి రాగలడని అన్నాడు. ఇంగ్లిస్ కూడా ఉన్నాడని చెప్పాడు.
గత సీజన్‌లో కూడా ఇదే పరిస్థితి
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీలో భాగంగా ఉన్నాడు. అప్పుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ను ఆర్సీబీ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు 10 మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ బ్యాట్ నుంచి కేవలం 52 పరుగులు మాత్రమే వచ్చాయి. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సగటు 5.78 అంటే గత సీజన్ నుంచి ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. 2020 సీజన్ లో 13 మ్యాచ్‌ల్లో 108 పరుగులు చేశాడు. అతను 2018లో 12 మ్యాచ్‌ల్లో 169 పరుగులు, 2016లో మ్యాచ్‌ల్లో 179 పరుగులు, 2015లో 11 మ్యాచ్‌ల్లో 145 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు 24 సగటుతో 2812 పరుగులు చేశాడు. లీగ్‌లో అత్యధికంగా డకౌట్ అయిన ఆటగాడు కూటా అతనే కావడం గమనార్హం.
జీతం 100 కోట్లకు పైగా దాటింది..
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2012 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు మ్యాక్స్‌వెల్ లీగ్ నుంచి జీతంగా రూ.100 కోట్ల 64 లక్షలు సంపాదించాడు. ప్రారంభంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఢిల్లీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ ముంబై ఇండియన్స్‌కు వచ్చాడు. దీని తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లో చేరాడు. 2018లో ఢిల్లీ జట్టులో, 2020లో పంజాబ్ జట్టులో భాగమయ్యాడు. 2021 వేలంలో ఆర్సీబీ అతడిని 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ తరపున నాలుగు సీజన్లు ఆడిన తర్వాత.. అతను పంజాబ్ కింగ్స్ జట్టుకు తిరిగి వచ్చాడు.