
ముంబై: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ అపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. రోహిత్ భార్య రితికా సజ్దె ఈ మధ్యే పండంటి పాపకు జన్మనిచ్చింది. తన ముద్దుల తనయకు 'సమైరా' అని పేరు పెట్టినట్లు హిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తనతో భార్య, కుమార్తె ఉన్న ఫోటోను రోహిత్ పోస్టు చేశాడు. దాంతో పాటు తన చిన్నారి కోసం ఒక కవిత కూడా రాశాడు. 'గర్ల్స్ లైక్ యూ' అనే పాట లింక్‌ను షేర్ చేస్తూ ''ఈ వీడియో చూసినపుడల్లా ఒళ్లు పులకరిస్తూనే ఉంటుంది'' అనే వ్యాఖ్య జత చేశాడు.
అంతకుముందు సమైరా.. రోహిత్, రితికల చేతులను పట్టుకుని ఉన్న ఫోటోను అతను ట్విట్టర్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. రోహిత్ తన పాప ఫోటోలను పోస్టు చేస్తున్నప్పటికీ ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. గతవారం తన భార్య రితిక ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఆస్ట్రేలియా పర్యటనలోనున్న రోహిత్ స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. భారత ఓపెనర్ రోహిత్ ఆసీస్‌తో జరిగే వన్డే సిరీ్‌సలో పాల్గొనేందుకు 8న జట్టుతో చేరనున్నాడు. జనవరి 12న నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
అంతకుముందు రోహిత్ తన పాపాయి చేతిని మాత్రమే ఫొటో తీసి పోస్టు చేశాడు. అందులో 'హెలో వరల్డ్.. 2019 మనందరికీ బాగుండాలి' అని రోహిత్ శర్మ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపించారు రోహిత్ అభిమానులు. దాంతో పాటుగా 'భయ్యా మీ పాపాయికి రోహిక అనే పేరు పెడితే బాగుంటుంది' అంటూ సలహాలు కూడా ఇచ్చారు. రితికాను 2015 డిసెంబర్ 13న రోహిత్ శర్మ పెళ్లాడారు. మూడేళ్ల తరవాత వీరికి తొలి సంతానంగా పాపకు జన్మనిచ్చింది.