
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ టీ20 కెప్టెన్, బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ త్వరలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా నేషనల్ సెలక్టర్‌గా బెయిలీ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్ సోమవారం ప్రచురించాయి. ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్, సెలక్షన్ ఛైర్మన్ ట్రెవర్ హాన్స్ ప్యానెల్‌తో కలిసి జార్జ్ బెయిలీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
దేశవాళీ టీ20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడుతూనే జార్జ్ బెయిలీ సెలక్టర్‌గా నియమించబడ్డాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడుతూనే జాతీయ సెలక్టర్‌గా కొనసాగడం ఇదే తొలిసారి మాత్రం కాదు. గతంలో మాజీ కెప్టెన్లు డాన్ బ్రాడ్‌మాన్, మైకేల్ క్లార్క్ కూడా జాతీయ జట్టులో ఉంటూనే ఆస్ట్రేలియా సెలక్టర్‌గా పనిచేశారు.
2013-14 యాషెస్ సిరీస్‌లో ఐదు టెస్టులను బెయిలీ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున బెయిలీ ఐదు టెస్టులు, 90 వన్డేలు, 30 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017 సెప్టెంబర్‌లో చివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచ ఎలెవన్ తరఫున టి20 మ్యాచ్ ఆడాడు. ప్యానెల్‌లో చోటు దక్కినా.. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతానని 37ఏండ్ల జార్జ్ బెయిలీ తెలిపాడు.
బ్యాటింగ్ శైలితో మైదానంలో ఎక్స్‌పెరిమెంట్లు చేసే బెయిలీ.. తాజాగా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో భాగంగా టాస్మేనియా-విక్టోరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ప్రయోగమే చేశాడు. తలను మామూలుగానే ఉంచి శరీరం మొత్తాన్ని వికెట్ కీపర్ వైపు పెట్టి క్రీజులో పొజిషన్‌లో నిల్చున్నాడు. దీంతో అతడు ఎటువైపు నిల్చున్నాడో తెలియక బౌలర్ తికమకపడ్డాడు. అయితే, బంతి వేశాక మళ్లీ మామూలు పొజిషన్‌లోకి వచ్చి ఆడాడు. దీంతో బౌలర్ సహా ఆటగాళ్లు అందరూ విస్తుపోయారు.