హైదరాబాద్: ఆసీస్ మీడియా తనపై అక్కసు వెళ్లగక్కుతోందని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా 2015లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సమయంలో ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో గేల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆ దేశానికి చెందిన మీడియా సంస్ధలు గతేడాది జనవరిలో వరుస కథనాల్ని ప్రచురించాయి.
ఈ వార్తలపై క్రిస్‌గేల్ తాజాగా కోర్టుని ఆశ్రయించి ఫెయిర్ ఫాక్స్ అనే మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశాడు. 'ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఒక మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ తన డ్రెస్సింగ్ రూమ్‌కి మసాజ్ థెరపిస్ట్‌ని పిలిపించుకుని.. ఆమె మసాజ్ చేస్తుండగా తన మర్మాంగాన్ని చూపించినట్లు' ఫెయిర్ ఫాక్స్ అనే మీడియా సంస్థ వరుసగా వార్తలు రాసుకొచ్చింది.

ఈ వార్తలపై క్రిస్ గేల్ మాట్లాడుతూ 'మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదు. మీడియాలో వచ్చిన ఆ వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఈ కేసు విషయంలో నేను పోరాడాల్సి ఉంది. అందుకే న్యాయస్థానం ద్వారా పోరాడాలని నిర్ణయించుకున్నా' అని పేర్కొన్నాడు.
ఈ కేసుకు సంబంధించి క్రిస్ గేల్ న్యాయవాది బ్రూస్ మెక్లిన్టాక్ మాట్లాడుతూ 'ఆ మీడియా సంస్థ క్రిస్‌గేల్ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తోంది. గేల్‌ను కనుమరుగు చేయాలనేది వాటి ఉద్దేశం కాబోలు' అని పేర్కొన్నాడు. ఈ కేసు మరో పది రోజుల్లో కోర్టులో హియరింగ్‌కు రానుంది.
ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం బిగ్‌బాష్ లీగ్‌లో ఓ మహిళా జర్నలిస్ట్‌తో గేల్ మాట్లాడుతూ ఆమెను లైవ్‌లోనే డేట్‌కి పిలిచాడు. దీనిపై అప్పట్లో ఆసీస్ మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున క్రిస్‌గేల్‌పై విమర్శలు గుప్పించారు. చివరికు ఆ లీగ్ నుంచి శాశ్వతంగా క్రిస్‌గేల్ పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది.