
ఐపీఎల్ లెజెండ్స్ పేర్లు చెప్తే వారిలో ఏబీ డివిల్లీర్స్, క్రిస్ గేల్ పేర్లు కంపల్సరీ. ముఖ్యంగా ఆర్సీబీకి వీళ్లు చాలా కీలకం. ఈ క్రమంలోనే 'ఆర్సీబీ అన్‌బాక్స్' ఈవెంట్‌కు వీరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల ముందు వీరిద్దరికీ మెడల్స్ అందించిన ఆర్సీబీ యాజమాన్యం.. ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో వీరి పేర్లను చేర్చింది. అలాగే వీరి జెర్సీ నెంబర్లు 17, 333 రెండింటికీ కూడా రిటైర్‌మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా గేల్, డివిల్లీర్స్‌ను ఒక ప్రశ్న అడిగారు. వాళ్లు మళ్లీ ఆర్సీబీ తరఫున కమ్‌బ్యాక్ ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నవ్వేసిన గేల్.. 'కచ్చితంగా.. నేను రావడానికి రెడీ' అని చెప్పాడు. అయితే డివిల్లీర్స్ మాత్రం అది జరగదన్నాడు. ప్రస్తుతం ఈ జట్టు చాలా బాగుందని అభిప్రాయపడ్డాడు. 'మేం ఇప్పుడు వస్తే.. కనీసం ఆడే 11 మందిలో ఛాన్స్ కూడా దక్కదు. దాని కన్నా ఫ్యాన్స్‌గా ఉండి మా వాళ్లు కప్పు కొట్టాలని సపోర్ట్ ఇవ్వడమే బెటర్. ఈ సాలా కప్ నామ్దే' అని చెప్పాడు.
గేల్, డివిల్లీర్స్ ఇద్దరూ తమ టాప్ టచ్‌లో ఉన్నప్పుడు ఆర్సీబీ చాాలా డేంజరస్‌గా కనిపించింది. ఆ ఏడాది కోహ్లీ కూడా చెలరేగడంతో 2016లో ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే కప్పు మనదే అనుకుంటే.. చివరి మెట్టుపై సన్‌రైజర్స్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత కూడా నాకౌట్స్ వరకు చేరినా ఫైనల్ మాత్రం చేరలేదు. ఆ రోజులను గుర్తు చేసుకున్న డివిల్లీర్స్, గేల్ ఇద్దరూ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్‌ను తెగ మెచ్చుకున్నారు. తమ ఫ్యాన్ బేస్ చాలా గొప్పదని చెప్పారు.
'నా ఫేవరెట్ జ్ఞాపకం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలోనే ఉంది. ఈ ప్రేక్షకుల ముందు ఉండటమే. ఇది ప్రపంచంలోనే బెస్ట్ ఫ్యాన్ బేస్. ఇక్కడ క్రికెట్ మ్యాచులు గెలవడం చాలా అద్భుతమైన ఫీలింగ్' అని డివిల్లీర్స్ చెప్పాడు. గేల్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్లు సపోర్ట్ ఇచ్చినందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో ఆ 175 పరుగుల మూమెంట్ చాలా ప్రత్యేకం' అని చెప్పుకొచ్చాడు. కాగా, ఆర్సీబీ తరఫున డివిల్లీర్స్ 156 మ్యాచుల్లో 4491 పరుగులు చేశాడు. గేల్ అయితే 83 మ్యాచుల్లో 3163 రన్స్ చేశాడు.