INDvsAUS : ఆసీస్ దగ్గర సత్తా ఉంది.. క్లీన్ స్వీప్ చేయడం కష్టమే: మాజీ లెజెండ్

భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘోరమైన ప్రదర్శన చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఓడిన ఆసీస్.. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో చిత్తయింది.
ముఖ్యంగా ఢిల్లీలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిన విధానం విమర్శలకు దారి తీసింది. ఈ మ్యాచ్ విజయంతో నాలుగు టెస్టుల సిరీసులో భారత జట్టు 2-0 ఆధిక్యం సాధించింది. ఇది చూసిన చాలా మంది విశ్లేషకులు ఈ లెక్కన చూసుకుంటే భారత జట్టు మిగతా టెస్టుల్లో కూడా ఈజీగా గెలిచేస్తుందని, ఆసీస్‌కు వైట్ వాష్ తప్పదని అంటున్నారు.

చాలా ట్యాలెంట్ ఉంది..
అయితే భారత లెజెండరీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం ఇప్పుడే ఈ విషయంలో ఏం చెప్పలేమని తేల్చేశాడు. దీనికి ఉదాహరణగా 2001లో లక్ష్మణ్ (281), ద్రావిడ్ (180) బాదిన మ్యాచ్‌ను గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడిన భారత్‌ను ఈ లెజెండరీ ప్లేయర్లు ఇద్దరూ ఆదుకున్నారు. ఆ మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ఆ సిరీస్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాలో కూడా ఇంత భారీ ఇన్నింగ్సులు ఆడగలిగే బ్యాటర్లు ఉన్నారని, వాళ్ల డ్రెస్సింగ్ రూం సత్తా ఉన్న ఆటగాళ్లతో నిండి ఉందని కితాబిచ్చాడు.

ఒక్కరు డబుల్ సెంచరీ చేసినా..
ఆసీస్ బ్యాటర్లలో ఒక్కరు డబుల్ సెంచరీ చేసినా ఆ జట్టు పుంజుకుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ద్రావిడ్, లక్ష్మణ్ చేసిన మ్యాజిక్‌ను చేయగలిగే ఆటగాళ్లు ఆసీస్ వద్ద కూడా ఉన్నారని చెప్పాడు. ఇలాంటి సమయంలో వాళ్లు వైట్‌వాష్ ఎదుర్కొంటారని అనలేమన్నాడు. అయితే ఆస్ట్రేలియా జట్టులో చాలా సమస్యలు కూడా ఉన్నాయని స్పష్టం చేశాడు. 'ఇప్పుడే భారత జట్టు 4-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పలేం. వాళ్ల దగ్గర స్టీవ్ స్మిత్, లబుషేన్, ఉస్మాన్ ఖవాజా వంటి బ్యాటర్లు ఉన్నారు. వారిపైనే ఆస్ట్రేలియా విజయం ఆధారపడి ఉంటుంది' అని గంభీర్ వివరించాడు.

ఆ స్కోరు కూడా చెయ్యలేరు..
వార్నర్ లేని సమయంలో ఈ ముగ్గురే ఆ జట్టుకు కీలకమని తేల్చేశాడు. అలాగే వాళ్ల ఆటతీరుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఈ ఆటగాళ్లకు ఇప్పుడు సడెన్‌గా డిఫెన్స్ నేర్పించడం అసాధ్యం. సిరీస్ మధ్యలో టెక్నిక్ మెరుగు పరుచుకోవాలని అనుకుంటే.. రెండో మ్యాచులో చేసినన్ని పరుగులు కూడా చేయలేరు. ఇప్పుడు ఆ జట్టును వ్యక్తిగతంగా కీలక ఆటగాళ్లు చేసే ప్రదర్శనలే కాపాడతాయి. కాబట్టి వాళ్లపైనే ఆధారపడాలి. అంతేకానీ, ఇప్పటికప్పుడు అంతా కలిసి రాణించాలంటే కుదరదు' అని స్పష్టం చేసేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications