
హైదరాబాద్: ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అది రాజకీయ, వ్యాపార, సినిమా, క్రీడా ఇలా ఏ రంగమైనా కావొచ్చు. ఓ వ్యక్తి ఎదుగుతున్నారంటే వారి వెనుక గురువులు కీలక పాత్ర పోషిస్తారు. ఇక సెప్టెంబర్ 5న భారత మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవంను ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత క్రికెటర్లు ట్విటర్‌లో తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పారు.
'నాకు చదువు చెప్పిన వాళ్లందరూ లేకపోతే ఇలా ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. వారందరికీ నేను ఎంతో రుణపడి ఉంటా' అని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. 'మీకందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డామంటే దానికి కారణం ఉపాధ్యాయులు, క్రికెట్ కోచ్‌లు. నన్ను ఒక ఆటగాడిగా ప్రోత్సహించిన కోచ్‌లకు, చిన్ననాటి గురువులకు నా వందనాలు. వీరంతా నా జీవితంలో ఒక స్థంభాల్లా నిలబడి నాకు మార్గనిర్దేశనం చేశారు' అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు. 'నాలాంటి సున్నా విద్యార్థులకు దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పారు. ప్రతీ అంకెకూ ఆ సున్నాని జోడిస్తే.. అదెంత విలువ పెరుగుతుందో చెప్పారు. మీలాంటి ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
'నా జీవితంలో ఇప్పటికి నా గురువులు, కోచ్‌లు, టీమ్‌మేట్స్, మెంటార్స్, కుటుంబ సభ్యులు ఇచ్చే సూచనలు పాటిస్తుంటా. ఇక మీదట కూడా అలాగే ఉంటా. మీకందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. నన్ను ప్రోత్సహించిన నా గురువులకు, కోచ్‌లకు ధన్యవాదాలు. మనం నేర్చుకుంటాం ఉన్నంత వరకు గురువులు మనతోనే ఉంటారు' అంటూ టీమిండియా టెస్టు ఆటగాడు అజింక్యా రహానే తెలిపాడు.
'ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా చిన్ననాటి కోచ్ మధన్ శర్మ జీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అదంతా ఆయన చలవే' అంటూ టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ రాసుకొచ్చాడు. రోజు విశిష్టతను పురస్కరించుకొని పలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సైతం స్పందించాయి. తమ ట్వీట్లలో ఆయా జట్ల కోచ్‌లు, సహాయక సిబ్బంది ఫొటోలు పంచుకొని వారికి హ్యాపీ టీచర్స్ డే అంటూ శుభాకాంక్షలు చెప్పాయి.