రోహిత్ శర్మ, కోహ్లీ విషయంలో హెడ్ కోచ్ గంభీర్ అసంతృప్తిగా ఉన్నట్లు తాజాగా మరోసారి వార్తలు వచ్చాయి. ఇంతకీ ఈ ముగ్గురి మధ్య ఏం జరిగిందంటే?
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, రెస్ట్ పేరుతో బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ బరిలోకి దిగలేదు. దీంతో హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన రోహిత్.. తాను ఎక్కడికీ వెళ్లట్లేదని, రిటైర్మెంట్ ప్రకటించట్లేదని స్పష్టం చేశాడు. కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

కానీ వాస్తవానికి బాక్సింగ్ డే టెస్టు తర్వాతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నాడట. అయితే శ్రేయోభిలాషుల సూచనల మేరకు వెనకడుగు వేసినట్లు అప్పుడు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అయితే ఇలా రిటైర్మెంట్ విషయంపై హిట్ మ్యాన్ యూటర్న్ తీసుకోవడం, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు నచ్చలేదట. ఈ విషయం గంభీర్ ను అసంతృప్తికి గురి చేసిందనే వార్తలు తాజాగా ఇంగ్లీష్ మీడియాలో వస్తున్నాయి. మరోవైపు సీనియర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట తీరుపైనా కోచ్ గంభీర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆ విషయంపైనే చర్చ
తాజాగా బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోవడంపై ఇందులో చర్చించారట. ఈ మీటింగ్ లో రోహిత్, విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రికెటర్లు దేశవాళీలో ఆడకపోవడంపై చర్చించినట్లు తెలిసింది. సీనియర్లందరూ కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించారట. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు ఫిజియో నుంచి పర్మిషన్ వస్తేనే మినహాయింపు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
ఒకవేళ సీనియర్లకు దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటే, దాని గురించి కచ్చితంగా కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయం తీసుకుంటారట. ఇకపోతే ఈ మీటింగ్ లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం అందింది. మొత్తంగా కేవలం ఆసీస్ పర్యటన ఓటమిపైనే సమీక్షించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.