
హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుని ముందుండి ఫైనల్‌కి చేర్చిన గంభీర్ సోమవారం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. యువ క్రికెటర్లకి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు.
గంభీర్ స్థానంలో ఆ జట్టు యువ ఆటగాడు నితీశ్ రాణా ఢిల్లీ జట్టు పగ్గాలు అందుకునే అవకాశాలున్నాయి. విజయ్ హజారే ట్రోఫీ 2016-17 సీజన్‌లో గంభీర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అప్పట్లో రిషబ్ పంత్‌కి బాధ్యతలు అప్పగించింది. అయితే, అతడు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు.
ఈ కారణం చేత 2017-18 సీజన్‌కి మళ్లీ గంభీర్ చేతికే సెలక్టర్లు జట్టు పగ్గాలు అప్పగించారు. తాజా సీజన్‌లో గంభీర్ ఓ సెంచరీతో పాటు మొత్తం 518 పరుగులు చేశాడు. అంతేకాదు టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.