
విరాట్ కోహ్లీ టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్‌పంత్‌తోపాటు జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే టీమిండియాను నడిపించాలంటే కపిల్ దేవ్ వంటి నిఖార్సైన ఆల్‌రౌండర్ కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, భారత జట్టు రెండు ప్రపంచకప్‌లు గెలవడంతో కీలకపాత్ర పోషించిన బ్యాటర్ గౌతం గంభీర్ ఈ విషయమై స్పందించాడు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కపిల్ దేవ్ వంటి ఆటగాడు టీమిండియాకు దొరకడనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని గౌతం గంభీర్ సూచించాడు. దీంతో తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలని చెప్పాడు. భారత జట్టు చేయలేనిది సృష్టించకూడదని, అలా చేస్తే సమస్యలు వస్తాయని తెలిపాడు. అందుకే ఇక కపిల్ దేవ్ వారసుడుని వెతికే ప్రయత్నాలు మానుకోవాలని గంభీర్ సూచించాడు. టీమిండియాను నడిపించే సత్తా ఉన్న ఆటగాడిగే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయిలో కాకుండా, దేశీయ స్థాయిలోనే తయారు చేసుకోవాలని గంభీర్ సూచించాడు. అక్కడే అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాలని చెప్పాడు. రంజీ ట్రోఫీలోనే వారికి కావలసిన సత్తాను అందించాలని తెలిపాడు. వాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు, నేరుగా ప్రదర్శన ఇచ్చే స్థాయిలో ఉండాలని 40 ఏళ్ల గంభీర్ అన్నాడు. ఇండియా ఏ, రంజీ ట్రోఫీ ద్వారా తీర్చిదిద్దబడిన ఆటగాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలగాలని చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో తగిన అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించాడు. అలాగే విజయ్ శంకర్, శివమ్ దూబే, వెంకటేష్ అయ్యర్ వంటి యువ ఆల్‌రౌండర్లు రంజీల నుంచి వచ్చిన వారేనని గంభీర్ గుర్తు చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ అయినా గౌతం గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు. దీంతో జట్టు కూర్పు, వ్యూహాలపై గంభీర్ దృష్టిపెట్టాడు. త్వరలో జరగబోయే వేలంలోనూ గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఐపీఎల్‌లో గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. ఆ జట్టును విజయవంతంగా నడిపించాడు. ఏకంగా రెండు సార్లు కోల్‌కతాకు టైటిల్ కూడా అందించాడు. దీంతో గంభీర్‌పై లక్నో భారీ అంచనాలు పెట్టుకుంది.