న్యూఢిల్లీ: గత కొంత కాలంగా టీమిండియాకు దూరమైన గౌతమ్ గంభీర్‌కు మరోసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. సొగసైన ఆటతీరు, క్లాసిక్ షాట్లు, నిలకడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించడంలో ముందుండే ఈ ఆటగాడు.. ఫాం లేమితో గతంలో టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల గంభీర్ మంచి ఫాంలో కొనసాగుతున్న నేపథ్యంలో అతనికి టీమిండియా నుంచి తాజాగా పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్‌తో 2014లో జరిగిన టెస్ట్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన గంభీర్.. పునరాగమనం చేసేందుకు అప్పట్నుంచి చేయని ప్రయత్నం లేదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నా.. సెలెక్టర్లు కనికరించలేదు.
అయితే, న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగిన 500వ టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడడంతో కోల్‌కతాలోని ఈడెన్‌లో జరిగే రెండో టెస్టులో ఆడేందుకు గంభీర్‌కు పిలుపొచ్చినట్లు సమాచారం. గతంలో గంభీర్, సెహ్వాగ్ ఓపెనింగ్ ఎంత భీకరంగా ఉండేదో అందరికీ తెలిసిన విషయమే. మరి తాజా అవకాశాన్ని గంభీర్ సద్వినియోగం చేసుకుంటాడో లేదో వేచిచూడాలి.

బెంగళూరులో ఫిట్‌నెస్ పరీక్ష
తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ (38).. వెనుదిరిగిన తర్వాత మైదానంలోకి రాలేదు. జట్టులో 12వ ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్ అతడి బదులు ఫీల్డింగ్ చేశాడు. దీంతో ఫామ్‌లో ఉన్న గంభీర్‌ను పిలవాల్సిందిగా కోచ్ అనిల్‌కుంబ్లే కోరినట్లు కొన్ని వర్గాల సమాచారం.
అదే నిజమైతే సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే టెస్టు కోసం గంభీర్ బెంగళూరులో మంగళవారం ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరవుతాడు. మరోవైపు శిఖర్‌ధావన్ సైతం సాధన చేస్తున్నాడు.
యువరాజ్‌కు సైతం పిలుపు
ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా టీమిండియా నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. వన్డే జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు కూడా ఫిట్నెస్ టెస్టులో పాల్గొనే అవకాశం ఉంది.