ముంబై ఇండియన్స్‌లో సంచలన ప్రదర్శనలు చేసి సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. పిచ్‌తో సంబంధం లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ మిస్టర్ 360 ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు.
అయితే ఈ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో తానొక తప్పు చేశానని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. దాని గురించి ఇప్పటికీ పశ్చాత్తాపం పడుతున్నాని చెప్పాడు. అసలేం జరిగిందంటే.. 2014 నుంచి 2017 వరకు సూర్యకుమార్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కేకేఆర్ ఫినిషర్‌గా బరిలోకి దిగాడు.

అనంతరం 2018లో సూర్య ముంబై ఇండియన్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. మూడు లేదా నాలుగో స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీని గురించి కోల్‌కతా మాజీ కెప్టెన్ గంభీర్ స్పందిస్తూ సారథిగా సూర్య శక్తిని ప్రపంచాన్ని చూపించలేకపోయానని చెప్పాడు. సూర్యకు టాప్ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని గంభీర్ అన్నాడు.
''ఉత్తమ ఆటగాళ్లను వెతికి, వాళ్ల శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడమే నాయకుడి అసలు బాధ్యత. కానీ నా ఏడేళ్ల కెప్టెన్సీలో ఏ విషయం గురించి అయినా పశ్చాత్తాపం ఉందంటే అది సూర్యకుమార్ గురించే. సూర్య ప్రతాపాన్ని నేను, మా జట్టు ఉపయోగించుకోలేకపోయింది. అయితే దానికి ప్రధాన కారణం జట్టు కూర్పు. మూడో స్థానంలో ఒక్క ప్లేయర్ మాత్రమే ఆడగలడు. కెప్టెన్‌గా తుది జట్టులో మిగిలిన పది మంది ఆటగాళ్ల గురించి కూడా ఆలోచించాలి''
''అప్పుడు సూర్య మూడో స్థానంలో మరింత సత్తాచాటగలిగేవాడు. అయితే అతను ఏడో స్థానంలో కూడా మంచి ఆటగాడే. సూర్య ఓ టీమ్ మ్యాన్. ఏ ఆటగాడైనా గుడ్ ప్లేయర్ కాగలడు. కానీ అందరూ టీమ్ మ్యాన్ అవ్వలేరు. సూర్యను ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించండి, అంతేగాక బెంచ్‌కే పరిమితం చేయండి. అయినా అతను నవ్వుతూ జట్టు కోసం పోరాడుతూనే ఉంటాడు.అందుకే 2015లో అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించాం'' అని గంభీర్ పేర్కొన్నాడు.