హైదరాబాద్: టీమిండియా వెటరన్ టెస్టు ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) మేనేజింగ్ కమిటీలో గంభీర్‌ను ప్రభుత్వ నామినీగా కేంద్ర క్రీడాశాఖ ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా గంభీర్ ట్విటర్ ద్వారా కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డీడీసీఏ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా గంభీర్ పేర్కొన్నాడు.

'గతంలో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఆటగాడిగా గౌరవం దక్కింది. ఇప్పుడు డీడీసీఏ ప్రతిష్టను పెంచే సమయం వచ్చింది. డీడీసీఏ మేనేజింగ్ కమిటీలో ప్రభుత్వ నామినీగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్‌కు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.
36 ఏళ్ల గౌతం గంభీర్ ఇప్పటి వరకు భారత్ తరుపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2007లో టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో గంభీర్ టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గంభీర్ రంజీల్లో ఢిల్లీ జట్టు తరుపున ఆడుతున్నాడు.