భారత్-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందే టీమిండియా అభిమానులకు బీసీసీఐ ఓ ప్రత్యేక కానుక ఇచ్చింది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మధ్య సాగిన ఇంటర్వ్యూను బీసీసీఐ బుధవారం పంచుకుంది.
19 నిమిషాలకు పైగా సాగిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మైదానంలో దూకుడుగా ఉండే ఈ ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు. గంభీర్ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పాడు. వన్డేల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు కంటే విలువైన ఓ భారతీయ ప్లేయర్ ఇన్నింగ్స్ గురించి గౌతీ వివరించాడు. అలాగే భారత టెస్టు క్రికెట్‌ను మార్చిన ఘనత కోహ్లిదే అని గంభీర్ కొనియాడాడు.

''కోహ్లి.. నువ్వు పాతికేళ్ల వయస్సులో లేదా 24 ఏళ్లప్పుడు భారత టెస్టు జట్టు పగ్గాలు అందుకున్నావు. బలమైన బౌలింగ్ దళాన్ని సిద్ధం చేశావు. జట్టును నిర్మించిన నీకు అసలైన క్రెడిల్ ఇవ్వాలి. టెస్టు మ్యాచ్‌లు గెలవాలంటే 20 వికెట్లు సాధించాలని బౌలింగ్ యూనిట్‌ను మార్చిన తీరుకు ఘనత ఇవ్వాలి. అదే..నిన్ను భారత్‌లో అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా చేసింది. ఆ యాటిట్యూడ్ విదేశాల్లో టెస్టులు గెలిచేలా మార్చింది''
''టెస్టు క్రికెట్ అభివృద్ధి చేయడంలో నువ్వు ప్రధాన పాత్ర పోషించావు. టెస్టు క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తావో నువ్వు చెప్పిన మాటలు.. వచ్చే తరం ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్‌ను ప్రేమించేలా చేశాయి. ఇక ఆసియా కప్‌లో 300+ టార్గెట్ ఛేజింగ్‌లో నువ్వు సాధించిన 183 పరుగులు.. వన్డేల్లో భారత ఆటగాడు సాధించిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నేను భావిస్తున్నాను''

''నీ ముందు కూర్చున్నా కాబట్టి ఈ విషయాన్ని చెప్పట్లేదు. గతంలో కూడా ఇది చాలా సార్లు చెప్పాను. ఎంతో మంది క్రికెటర్లు డబుల్ సెంచరీ సాధించారు. కానీ నేను ఆ కోణంలో చూడట్లేదు. ఎందుకంటే ప్రత్యర్థి సామర్థ్యాన్ని, పిచ్ పరిస్థితులను బట్టి ఇది చెబుతున్నా. ఢాకా వేదికగా ఛేదనలో 300+ స్కోరును పాకిస్థాన్‌పై సాధించావు. భారత క్రికెట్‌ను నువ్వు ఎంతో ముందుకు తీసుకెళ్లావు. నువ్వు మిగిల్చి లెగసీని వచ్చే జనరేషన్ కొనసాగించాలని కోరుకుంటున్నాను'' అని గంభీర్ అన్నాడు.
వన్డేల్లో భారత్ తరఫున అయిదుగురు బ్యాటర్లు డబుల్ సెంచరీలు సాధించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ద్విశతకాలు బాదారు. ఇక రోహిత్ ఏకంగా మూడు సార్లు 200+ స్కోరు సాధించాడు. 2014లో శ్రీలంకపై రోహిత్ ఏకంగా 264 పరుగులు బాదాడు. కాగా, 2012లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్‌కు పాకిస్థాన్ 330 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు సాధించడంలో భారత్ 47.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన గంభీర్ డకౌటయ్యాడు.