హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన రెండో కుమార్తెకి పెట్టిన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జూన్ నెలలో గంభీర్ భార్య నటాషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గంభీర్ తన కుమార్తె పేరును ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
తన ఇద్దరి కూతుళ్ల ఫోటోను ట్విట్టర్‌లో ఉంచి 'మా హృదయాలను గెలుచుకున్న ఇద్దరు రాకుమార్తెలు.. ఆజీన్, అనైజా' అని పేర్కొన్నాడు. 'అనైజా' పేరు ఎంతో ప్రత్యేకంగా ఉందని, ఈ పేరుకు అర్థం ఏమిటో చెప్పాలని అభిమానులు గంభీర్‌ని కోరుతున్నారు.

2011 అక్టోబరులో గంభీర్.. నాటాషాను వివాహం చేసుకున్నారు. ఇప్పటికే మూడేళ్ల కూతురు 'ఆజీన్' అనే కుమార్తె ఉంది. అజీన్ ఒడిలో ఉన్న అనైజాను చూసిన అభిమానులు 'సో క్యూట్' అంటూ సంబరపడిపోతున్నారు. మాజీ కెప్టెన్ ధోనితో సహా క్రికెటర్లందరూ ఈ ఫొటోపై కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి సారథిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఐపీఎల్-10వ సీజన్‌లో గంభీర్ 16 మ్యాచుల్లో 498 పరుగులు చేశాడు. 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ చివరి సారిగా భారత జట్టు తరుపున ఆడాడు.