
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సెప్టెంబరు 17న ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్‌లో ఆడనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మరోసారి క్రికెట్ గ్రౌండ్లో ప్లేయర్‌గా అడుగుపెట్టనుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. లోక్‌సభ సభ్యుడిగా ప్రస్తుతం గౌతమ్ గంభీర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇక గంభీర్ ఇండియా మహారాజాస్ తరఫున ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న జరిగే ప్రత్యేక మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. అతను సెప్టెంబర్ 17 నుంచి అందుబాటులోకి వస్తాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని వరల్డ్ జెయింట్స్‌తో జరిగే ప్రత్యేక మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మహారాజాస్‌కు నాయకత్వం వహించనున్నాడు.
'సెప్టెంబర్ 17నుంచి జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనడానికి నేను సిద్ధమయ్యానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరోసారి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాలనే ఆశతో నేను ఉత్సాహంగా ఉన్నాను. మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో భుజాలు ఎగురవేసేందుకు రెడీ కావడం చాలా ఎక్సయింగా ఉంది' అని గంభీర్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నాడు. గంభీర్ భారత్ తరపున 58టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2007లో భారత టీ20 ప్రపంచకప్ విజయంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అలాగే 2011లో ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ప్రపంచ కప్ ఫైనల్‌లో గెలవడంలోనూ గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ లభించింది. గంభీర్ 2018లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా గంభీర్ ప్రకటనపై మాట్లాడుతూ.. '2011 ప్రపంచకప్ ఫైనల్స్‌లో 97పరుగులతో విన్నింగ్ నాక్ ఆడిన గౌతమ్ గంభీర్‌ను ఎవరు మర్చిపోతారు?' సీజన్ 2లో గౌతమ్ గంభీర్‌తో పాటు ఇతర దిగ్గజ ఆటగాళ్ల నుంచి ఉత్కంఠభరితమైన ప్రదర్శనను అభిమానులు పొందడం ఖాయమని నేను అనుకుంటున్నాను.' అని చెప్పాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2వ ఎడిషన్‌లో 4జట్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడుతాయి.