ముంబై: చాలా కాలం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న గౌతమ్ గంభీర్.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మూడో టెస్టులో కూడా అతని రిజర్వు బెంచ్ కే పరిమితయ్యే అకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, గంభీర్‌కు అనుకోని మద్దతు లభించింది.
సొంతగడ్డపై భారత్ సుదీర్ఘ టెస్టు సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ జట్టులో ఉండాలని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
'గంభీర్ మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పటికే స్పిన్నర్లను ఎదుర్కొవడంలో తానేంటో నిరూపించుకున్న గంభీర్.. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లు గాయపడటంతో కచ్చితంగా మూడో టెస్టులో బరిలోకి దిగే అవకాశముంది. సుదర్ఘీ టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో టాప్ ఆర్డర్‌లో జట్టుకు గంభీర్ అవసరం చాలా ఉంది' అని బంగర్ వివరించాడు.

కాగా, గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో కూడా గంభీర్ ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకి గంభీర్ ఎంపికైనా తుదిజట్టులో అతనికి చోటు దక్కలేదు.
అయితే రెండో టెస్టులో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా గాయపడటంతో శనివారం నుంచి ఆరంభంకానున్న మూడో టెస్టులో గంభీర్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నా.. మరో యువ క్రికెటర్ కరుణ్ నాయర్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే వీరిలో ఎవరు మూడో టెస్టులో ఆడతారనేది తేలాల్సి ఉంది.