శ్రీలంక పర్యటనకు తెలుగు తేజం తిలక్ వర్మను ఎంపిక చేయాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ విశ్వప్రయత్నాలు చేశాడట. సెలక్టర్లను ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాడని సమాచారం. కానీ ఆఖరి నిమిషంలో తిలక్ స్థానంలో రియాన్ పరాగ్ ఎంపికయ్యాడని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గంభీర్ శ్రీలంక పర్యటనతో తన యాక్షన్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు ఎంపికలో గంభీర్ తన మార్క్‌ను చూపించాడు.
జట్టుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కెప్టెన్ కావాలని హార్దిక్ పాండ్యకు బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా ఎంపిక చేశాడు. ఇక రియాన్ పరాగ్‌ను టీ20లతో పాటు వన్డేలకు సెలక్ట్ చేశాడు. యువ పేసర్ హర్షిత్ రాణాకు వన్డేల్లో అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మను ఎంపిక చేయలేదు. అయితే ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మను భారత జట్టులోకి తిరిగి తీసుకురావాలని గంభీర్ ప్రయత్నించాడని సమాచారం.

గతేడాది భారత్ తరఫున అరంగేట్రం చేసిన తిలక్ వర్మ టీ20 వరల్డ్ కప్ ముంగిట వరకు టీ20 జట్టులో కొనసాగాడు.
మెగాటోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన తిలక్ ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. అయితే ఒత్తిడిలో కూడా ప్రశాంతతో సత్తాచాటే ఈ బ్యాటర్‌ను శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయాలని నయా కోచ్ భావించాడు. దీని కోసం సెలక్టర్లను ఒప్పించడానికి గంభీర్ ట్రై చేశాడు. కానీ తిలక్ వర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని, గాయం కారణంగా జట్టు ఎంపిక ప్రణాళికలో లేడని గంభీర్‌కు సెలక్టర్లు వివరించారని జాతీయ మీడియా పేర్కొంది.
దీంతో రియాన్ పరాగ్‌ను ఎంపిక చేశారని రాసుకొచ్చింది. గత కొంతకాలంగా పరాగ్ నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్న విషయం తెలిసిందే. ''పరాగ్ టాలెంటెడ్. తన ఆటను మెరుగుపర్చుకుంటున్నాడు. క్రీజులో నిలబడి పరుగులు వరద పారించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను బంతితోనూ రాణిస్తూ జట్టుకు మరింత విలువ తీసుకురాగలడు. దీంతో సెలక్టర్లు అతనికి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు''అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.