
టీమిండియా వెటరన్ బ్యాటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే చాలా కాలంగా ఫాంలో లేరు. ఇటీవల కాలంలో మరీ దారుణంగా ఆడుతూ జట్టుకు భారంగా మారారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వీరి ఫాంపై స్పందించారు. పుజారా, రహానే చాలా కాలంగా ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని త్వరలో జరగబోయే రంజీ ట్రోఫీ వారికి మంచి అవకాశం అని ఆయన చెప్పుకొచ్చారు. పరుగులు సాధించి తమను తాము నిరూపించుకోవడానికి రంజీ ట్రోఫీ పుజారా, రహానేకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఒకరకంగా పుజారా, రహానేనే గంగూలో హెచ్చరించారే చెప్పుకోవాలి. అయితే వారికి తన సూచన మాత్రమేనని గంగూలీ తెలిపారు. కెరీర్‌లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక సారి ఫాం కోల్పోతారని ఆయన చెప్పారు. ప్రస్తుతం వారికి బ్యాడ్ టైమ్ నడుస్తుందని, ఇది వారికి గడ్డుకాలంగా చెప్పవచ్చని అన్నారు. అయితే ప్రస్తుతం ఫాంలో లేకపోయినప్పటికీ పుజారా, రహానే గతంలో భారత జట్టు తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడారని ఆయన తెలిపారు.
కాగా 2005లో తాను కూడా ఫాం కోల్పోయి ఇబ్బంది పడ్డానని గంగూలీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు రంజీలో ఆడి, పరుగులు సాధించి సూపర్ కమ్‌బ్యాక్‌తో జట్టులోకి వచ్చానని తెలిపారు. అందుకే పుజారా, రహానే కూడా రానున్న రంజీ ట్రోఫీలో ఆడడం ద్వారా ఫాంలోకి రావచ్చని వారికి గంగూలీ సూచించారు. అయితే చాలా కాలంగా ఫాంలో లేక ఇబ్బందిపడుతున్న పుజారా, రహానేకు రానున్న శ్రీలంక సిరీస్‌లో చోటు దక్కడం కష్టమనే తెలుస్తోంది. ఇప్పటికే పుజారా, రహానేకు చాలా అవకాశాలు ఇచ్చారని అనేక మంది అంటున్నారు.
దీనికి తోడు సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా ఓటమికి వారి వైఫల్యమే కారణమని నిందిస్తున్నారు. దీనికి తోడు టీమిండియాకు బలమైన రిజర్వ్ బెంచ్ కూడా ఉంది. బెంచ్‌లో అవకాశం కోసం యువ ఆటగాళ్లు ఒక అవకాశం అంటూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుజారా, రహానేకు జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఒక వేళ రానున్న రంజీ టోర్నీలో భారీగా పరుగులు సాధిస్తే మరో అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే కరోనా కారణంగా వాయిదా పడ్డ రంజీ ట్రోఫీ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే మధ్యలో ఐపీఎల్ ఉన్నందున రంజీ ట్రోఫీని రెండు దశలుగా నిర్వహించానున్నారు. మొదట లీగ్‌స్టేజ్ మ్యాచ్‌ల వరకు నిర్వహించి, ఐపీఎల్ ముగిశాక నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం ఈ రంజీ ట్రోఫీలో 38 జట్లు పాల్గొంటుననాయి.