న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడి పదవి టీమిండియా మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని వరించనుందా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న వార్త ఇది. లోథా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు వెలువరించనున్న తీర్పు నేపథ్యంలో బీసీసీఐ పాలకమండలికి పదవి గండం పొంచి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లోథా కమిటీ సంస్కరణల అమలు నేపథ్యంలో ఇప్పటి వరకు పదవుల్లో కొలువుదీరిన వారంతా వైదొలిగితే అధ్యక్ష స్థానం గంగూలీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం లోథా కమిటీ సంస్కరణల అమలుపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ సమర్థంగా అమలు చేయగలరనే వాదన క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు.

మరోవైపు బెంగాల్ క్రికెట్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా పరిపాలన అనుభవం కూడా గంగూలీకి ఉండటం కలిసొచ్చే విషయం. 96 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా మ్యాచ్ ఫిక్సింగ్ భూతం క్రికెట్‌ను కుదిపేస్తున్న సమయంలో పగ్గాలు చేపట్టిన గంగూలీ అత్యుత్తమ సారథిగా పేరు తెచ్చుకున్నాడు.
అంతేకాదు ఫిక్సర్ల వెన్నులో వణుకుపుట్టేలా వ్యవహరించాడు. 'దాదాను అప్రోచ్ అయ్యే దమ్మ ఎవరికీ లేదు' అని ఓ బూకీ ఆన్ రికార్డు చెప్పడం భారత క్రికెట్ పట్ల గంగూలీ నిజాయితీని చాటడమే. తాను అనుకున్నది సాధించేవరకూ పోరాడటంలో దాదను మించిన వారు లేరంటే నమ్మండి.
2003 వరల్డ్ కప్‌లో రాహుల్ ద్రవిడ్‌తో కీపింగ్ చేయించడం.. ఇటీవల తన ప్రమేయంతో అనిల్ కుంబ్లేను టీమిండియాకు కోచ్‌గా నియమించడం దాదా పనితీరుని తెలియజేస్తాయి. టీ20 వరల్డ్ కప్‌లో దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో ఈడెన్ గార్డెన్‌లో ఎన్నో మ్యాచ్లను సమర్థంగా నిర్వహించారు.
దాదా సమర్ధతను బట్టి బీసీసీఐ అధ్యక్షుడి పాలనా పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని మాజీలతో పాటు పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దాదా అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ)లోని ప్రత్యర్థులే కొందరు అడ్డుపడొచ్చునని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.