లెజెండ్స్ లీగ్ లోని గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో హై వోల్టేజ్ మూమెంట్ చోటు చేసుకుంది. సీనియర్ ప్లేయర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ మ్యాచ్ మధ్యలో గొడవకు దిగారు. ఈ వాగ్వాదానికి కారణం గంభీర్ అని మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ పేర్కొన్నాడు. తనని అసభ్యకర మాటలు అన్నాడని, స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో సహా సహచర ఆటగాళ్లకు గంభీర్ మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు.
''మిస్టర్ ఫైటర్ గంభీర్ తో జరిగిన విషయంలో నా తప్పేమి లేదు. అతడు సహచర ఆటగాళ్లతో ఏ కారణం లేకుండా గొడవ పడుతూనే ఉంటాడు. సెహ్వాగ్ తో సహా సీనియర్ ప్లేయర్లకు కూడా గంభీర్ మర్యాద ఇవ్వడు. నన్ను చాలా అసభ్యకరమైన మాటలు అన్నాడు. గంభీర్ చేసిన నిర్వాకం తర్వలో మీ అందరికీ తెలుస్తుంది. మైదానంలో అతడు అలాంటి మాటలు అనకూడదు. అవి ఆమోదయోగ్యం కాదు'' అని శ్రీశాంత్ అన్నాడు.

ఈ మ్యాచ్ లో శ్రీశాంత్ వేసిన తొలి బంతిని గంభీర్ సిక్సర్ బాదాడు. తర్వాత బాల్ ను బౌండరీకి తరలించాడు. ఆ టైమ్ లో వీరిద్దరు ఒకరినొకరు సీరియస్ గా చూసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికీ వాగ్వాదం జరిగింది.
గంభీర్, శ్రీశాంత్ మైదానంలో దూకుడుగా ఉంటారు. గతంలో ఇద్దరు వివిధ సందర్భాల్లో అనేక వివాదాల్లో ఇరుకున్నారు. రీసెంట్ గా ఐపీఎల్ లో గంభీర్-కోహ్లి మధ్య జరిగిన హీట్ మూమెంట్ అందరికీ తెలిసిందే. లక్నోకు మెంటార్ గా ఉన్న గంభీర్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లితో వాగ్వాదానికి దిగాడు. తాజాగా గంభీర్ మరో ఫైట్ వివాదంలో ఇరుక్కున్నాడు. దీనిపై గంభీర్ స్పందించలేదు.
కాగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ ఏడు వికెట్లకు 223 పరుగులు చేసింది. గంభీర్ 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్ లో గుజరాత్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.