ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు చేసిన విదేశీ మాజీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, కెవిన్ పీటర్సన్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. ఇతరులను విమర్శించే ముందు తమ ట్రాక్ రికార్డును చూసుకోవాలని ఘూటు వ్యాఖ్యలు చేశాడు. పోలిక అంటే అర్థవంతంగా ఉండాలని, నారింజలతో ఆపిల్స్‌ను పోల్చకూడదని గంభీర్ ఎద్దేవా చేశాడు.
ట్రేడింగ్‌లో హార్దిక్ గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టు పగ్గాలు అందుకున్నాడు. కానీ ముంబైను ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. దీంతో హార్దిక్‌పై కొందరు అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దీని గురించి గంభీర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. హార్దిక్‌కు అండగా నిలిచి డివిలియర్స్, పీటర్సన్‌పై నేరుగా మండిపడ్డాడు.

''నిపుణులు ఏం చెబుతున్నారనేది ముఖ్యం కాదు. ఏదో ఒకటి చెప్పడమే వారి పని. నా దృష్టిలో జట్టు ప్రదర్శన ఆధారంగా కెప్టెన్సీని అంచనా వేయాలి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ గొప్ప ప్రదర్శన చేస్తే హార్దిక్‌ను అందరూ ప్రశంసించేవారు. కానీ ముంబై పేలవ ప్రదర్శన చేసింది. దీంతో హార్దిక్ గురించి మాట్లాడుతున్నారు''
''హార్దిక్ ఇతర ఫ్రాంచైజీ నుంచి తిరిగి ముంబై గూటికి చేరుకున్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హార్దిక్‌కు తగినంత సమయం ఇవ్వాలి. గుజరాత్ టైటాన్స్‌ను రెండేళ్లు నడిపించిన హార్దిక్ నుంచి ఒక్కసారి ముంబై తరఫున గొప్ప ఫలితాన్ని అంచనా వేయలేం. అయితే అతను అంచనాలను అందుకోగలడు. కానీ ఈ సందర్భంలో అందుకోలేకపోయాడు. అతనికి కాస్త టైమ్ ఇవ్వాలి''
''ప్రతి రోజు, ప్రతి మ్యాచ్, ప్రతి షాట్‌ను జడ్జ్ చేయడం సరికాదు. ఎవరైతే హార్దిక్‌ను విమర్శిస్తున్నారో వాళ్ల కెప్టెన్సీ రికార్డును ఒక్కసారి గమనించండి. అది ఏబీ డివిలియర్స్ అవ్వొచ్చు, కెవిన్ పీటర్సన్ అవ్వొచ్చు. వాళ్లు సారథిగా ఏం గొప్పలు సాధించారు? ఇతర కెప్టెన్ల కంటే చెత్త రికార్డు కలిగి ఉన్నారు. కాబట్టి నారింజ్లను నారింజలతో పోల్చండి. అంతేకానీ, ఆపిల్స్‌తో కాదు'' అని గంభీర్ అన్నాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.