ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మెంటార్ గౌతమ్ గంభీర్.. ఈ ఫ్రాంచైజీని వదిలేస్తున్నాడట. ఈ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఇటీవలే ఈ టీంను వదిలేశాడు. దీంతో అతని స్థానంలో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను లక్నో యాజమాన్యం తీసుకుంది.
అలాగే తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను తమ స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఇలాంటి సమయంలో వచ్చే ఐపీఎల్‌కు ముందే గంభీర్ ఈ ఫ్రాంచైజీని వదిలేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోచింగ్‌లో గంభీర్‌కు దక్కిన మొదటి పెద్ద జాబ్ ఎల్‌ఎస్‌జీ మెంటార్ అనే చెప్పాలి.

2022లో ఈ టీం జర్నీ మొదలైనప్పటి నుంచి గంభీర్.. లక్నో ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ తదితరుల కంటే గంభీర్ ప్రెజెన్స్ ఈ టీంలో ఎక్కువగా కనిపించేది. ఆడిన రెండు ఐపీఎల్ సీజన్లలో ప్లేఆఫ్స్ చేరడంతో ఈ టీం ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగింది. కానీ రెండు సార్లూ ఈ టీం ఫైనల్ చేరకుండానే వెనుతిరిగింది.
ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం లక్నో టీం మేనేజ్‌మెంట్, గంభీర్ మధ్య పరిస్థితి బాగలేదని తెలుస్తోంది. దీంతో గంభీర్ కూడా ఈ ఫ్రాంచైజీని వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందట. ఆండీ ఫ్లవర్ వెళ్లిపోయి నెల రోజులు తిరగకముందే గంభీర్ కూడా వెళ్లిపోవడానికి రెడీ అవడం ఆ టీం వాతావరణాన్ని ఇబ్బంది పెట్టేలా ఉందట.
'ఆండీ ఫ్లవర్ తర్వాత గౌతమ్ గంభీర్ ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీని వదిలేస్తున్నాడు. ఈ విషయంలో ఇంతకు మించి ఏం చెప్పలేం' అని లక్నో టీంకు చెందిన ఒక వ్యక్తి తెలిపాడు. అంతేకాదు, ఇప్పుడు టీంతో చేరిన ఎమ్మెస్కే ప్రసాద్‌తో గతంలో గంభీర్‌కు గొడవలు ఉన్నాయి. ఇది కూడా గంభీర్ నిష్క్రమణకు ఒక కారణం అయ్యుండొచ్చని తెలుస్తోంది.