బెంగళూరు: టీమిండియా సీనియర్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, గౌతం గంభీర్‌ల మధ్య కోపతాపాలు తగ్గినట్లు లేదు. తాజాగా వీరిద్దరి అభిప్రాయ బేధాలు మరోసారి విజయ్ హజారే వన్డే టోర్నీ సందర్భంగా బయటపడ్డాయి. ఈ నెల 23న జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఢిల్లీ నెగ్గిన తర్వాత ధోనీతో గంభీర్ వ్యవహరించిన తీరే ఆ విషయాన్ని బయటపెట్టింది.
మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న గంభీర్ జార్ఖండ్ జట్టు ఆటగాళ్లతో కరాచలనం చేసి ధోనీని మాత్రం మినహాయించాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ ఎదురుపడ్డా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ గంభీర్ మిగతా ఆటగాళ్లతో కలిసిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

కరచాలనం కోసం ధోనీ చేయి చాపినప్పటికీ గౌతం గంభీర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయిన దృశ్యం వీడియోలో స్పష్టంగా రికార్డయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టుకు చెందిన సభ్యులతో కరచాలనం చేయడం సంప్రదాయం. కానీ ధోనీతో కరచాలనం చేయడానికి కూడా గంభీర్ ఇష్టపడలేదు.
ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేయడం సంప్రదాయం మాత్రమే కాకుండా ఎదురు పక్షాన్ని గౌరవించడం కూడా. గంభీర్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.