న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యానని వచ్చిన ఫోన్‌కాల్‌కు తాను ఆశ్చర్యపోయానని భారత్, రాజస్థాన్ క్రికెట్ జట్ల మాజీ ఓపెనర్ గగన్ ఖోడా తెలిపారు.
సెంట్రల్ జోన్ నుంచి జాతీయ సెలక్షన్ కమిటీలో గగన్ ఖోడాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సోమవారం బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలోఅధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఈ కీలక మార్పులు చేశారు.
ప్రస్తుతం ఖోడా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పని చేస్తున్నారు. తాను గత కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నప్పటికీ ఈ ఫోన్ కాల్‌కు నిజంగా ఆశ్యర్యానికి గురైనట్లు ఆయన తెలిపారు. తనకు బిసిసిఐ అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వరిస్తానని ఖోడా ఆనందం వ్యక్తం చేశాడు.

భారత్ తరఫున ఆయన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎక్కువగా ఆడలేదు. 1998లో కేవలం బంగ్లాదేశ్, కెన్యాలతో రెండు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. అందులో అతని అత్యధిక స్కోరు 89 పరుగులు. అయితే, ఆ తర్వాత అతనికి జట్టులో స్థానం దక్కలేదు.
కాగా, దులీప్ ట్రోఫీలో భాగంగా 2000-2001లో పనాజీలో సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖోడా ట్రిపుల్ సెంచరీ చేశారు. 132 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఆడిన ఖోడా.. 8,516 పరుగులు చేశాడు. దాదాపు 40.00 సగటుతో 20 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు చేశాడు.