చెన్నై: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఇషాంత్ శర్మ క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఇషాంత్ శర్మను గేలి చేస్తూ క్రికెట్ అభిమానులు పోస్టులు పెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఇషాంత్ శర్మ దారుణమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
గాయం కారణంగా ఇషాంత్ శర్మ ఇటీవలి ఐసిసి ప్రపంచ కప్ పోటీలకు దూరమయ్యాడు. శనివారంనాడు అతను ఐపియల్ ట్వంటీ20 మ్యాచులోకి వచ్చాడు. పొడగరి అయిన ఇషాంత్ శర్మ మూడు ఓవర్లు మాత్రమే వేసి 46 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా ఆయనకు దక్కలేదు.

దానికి తోడు ఇషాంత్ శర్మ నాలుగు నో బాల్స్ కూడా వేశాడు. బ్రెండన్ మెక్‌కుల్లం ఇషాంత్ శర్మకు చుక్కలు చూపించాడు. ఇషాంత్ శర్మ వేసిన 12 బంతులను ఎదుర్కుని మెక్‌కుల్లం 30 పరుగులు తీసుకున్నాడు.
మెక్‌కుల్లం సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇషాంత్ శర్మా అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.