IPL Highest Run Scorer And Highest Wicket Takers: రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. ఇప్పుడు ఐపీఎల్ పండగ మొదలుకానుంది. మే 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్. ఓ వైపు మెరుగు వేగంతో పరుగులు చేసే బ్యాటింగ్ వీరులు, మరోవైపు వారిని కట్టడి చేసేందుకు బంతితో మాయ చేసే బౌలర్లు. మరి తాజా సీజన్ వచ్చేస్తోన్న నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ - 5 బ్యాటర్లు ఎవరు, అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్లు ఎవరు అనేది ఓ సారి గుర్తు చేసుకుందాం..
టాప్ 5 బ్యాటర్లు వీరే
1. విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. మొత్తంగా 252 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 244 ఇన్నింగ్స్ లో 8,004 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, 55 అర్ధ శతకాలు సాధించారు. సగటు 38, స్ట్రైక్ రేట్ 131గా ఉంది. కోహ్లీ అత్యధిక పరుగుల స్కోర్ 113 పరుగులు.
2.శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ 222 మ్యాచ్‌ల్లో 127.14 స్ట్రైక్ రేట్‌తో 6,769 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 106 నాటౌట్. 2 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు చేశాడు.
3. రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 257 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 43 అర్ధ శతకాలు బాది 6,628 పరుగులు సాధించాడు.
4. డేవిడ్ వార్నర్
సన్ రైజర్స్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 184 మ్యాచ్‌ల్లో 6,565 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 126 పరుగులు. 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ వార్నర్ ఐపీఎల్ 2025 వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.
5. సురేశ్ రైనా
సీఎస్కే మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. 205 మ్యాచ్‌ల్లో 5,528 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 100 నాటౌట్.

టాప్ బౌలర్లు వీరే..
1.యుజ్వేంద్ర చాహల్
మిస్టరీ స్పిన్నర్ చాహల్ 160 మ్యాచులు ఆడి 205 వికెట్లు తీసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు.
2. పీయూశ్ చావ్లా
సీనియర్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా.. 192 మ్యాచులు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు.
3. డ్వేన్ బ్రావో
విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. మొత్తం 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు.
4. భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ 176 మ్యాచులు ఆడి 181 వికెట్లు పడగొట్టాడు.
5. సునీల్ నరైన్
ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణిస్తోన్న నరైన్ మొత్తం 177 మ్యాచులు ఆడి 180 వికెట్లు తీశాడు.