ICC Womens World Cup 2025: భారత మహిళా క్రికెట్ జట్టు ఎట్టకేల తమ కల అయిన ప్రపంచ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన ఫైనల్లో సత్తా చాటిన 'విమెన్ ఇన్ బ్లూ' క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ ప్రపంచ కప్ గెలుపు వరకు వారి ప్రయాణం ఏ మాత్రం సులభం కాదు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని.. పరాజయాల నుంచి కోలుకుని పోరాడి ప్రపంచ ఛాంపియన్‌గా ఎలా నిలిచిందో తెలుసుకుందాం.
తొలిసారి మహిళల ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన భారత్
మహిళల ప్రపంచ కప్ 2025లో భారత్ ప్రయాణం ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలతో సాగింది. జట్టులోని ప్లేయర్లు ఓపిక, దృఢ సంకల్పంతో పోరాడి కలల నగరం ముంబైలో తమ కలను నిజం చేసుకున్నారు.
1.శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
భారత్ తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని శ్రీలంకపై గెలుపుతో ప్రారంభించింది. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కష్టకాలంలో దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ జట్టు స్కోరును 269/8కి చేర్చారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ (3/54) అద్భుతంగా రాణించి శ్రీలంకను 211 పరుగులకే పరిమితం చేసింది.
2.పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు
పాకిస్తాన్‌పై భారత్ 247 పరుగులు చేయగలిగింది. అనంతరం యువ సంచలనం క్రాంతి గౌడ్(3/20) అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. ప్రారంభంలోనే 26/3తో కష్టాల్లో పడిన పాకిస్తాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది.

3. దక్షిణాఫ్రికా చేతిలో తొలి ఓటమి
ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి ఓటమి దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైంది. 102 పరుగులకే 6 వికెట్లు పడినప్పటికీ.. రిచా ఘోష్ 77 బంతుల్లో 94 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 251కి చేర్చింది. అయితే నాడిన్ డి క్లర్క్ 54 బంతుల్లో 84 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ నుంచి విజయాన్ని లాగేసుకుంది.
4. ఆస్ట్రేలియా చేతిలో మరో ఎదురుదెబ్బ
భారత్ ఈ మ్యాచ్‌లో 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) రాణించారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఎలిసా హీలీ (142 బంతుల్లో 107 పరుగులు) సెంచరీ సాయంతో ఆ లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు షాక్ ఇచ్చింది.
5. ఇంగ్లాండ్‌తో స్వల్ప తేడాతో పరాజయం (హ్యాట్రిక్ ఓటమి)
ఇది భారత్‌కు టోర్నమెంట్‌లో వరుసగా మూడో ఓటమి. ఇంగ్లాండ్ కెప్టెన్ హీదర్ నైట్ (109) సెంచరీతో 288/8 స్కోరు చేసింది. స్మృతి మంధాన (88), హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ (50) అద్భుత ప్రదర్శన చేసినా భారత్ కేవలం 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ హ్యాట్రిక్ ఓటములతో భారత్ టాప్ 4 నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది.
6. న్యూజిలాండ్‌పై 'డూ ఆర్ డై' విజయం (D/L మెథడ్)
'డూ ఆర్ డై' అన్నట్లుగా మారిన ఈ క్లిష్టమైన మ్యాచ్‌లో స్మృతి మంధాన (109), ప్రతీకా రావల్ (122) అద్భుతమైన సెంచరీలు చేశారు. భారత్ 49 ఓవర్లలో 340/3 స్కోరు చేసింది. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌ను డక్వర్త్-లూయిస్ (D/L) పద్ధతిలో భారత్ 53 పరుగుల తేడాతో గెలిచి, సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
7. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం
ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ, ఎలిస్ పెర్రీ, యాష్లే గార్డ్‌నర్ అర్ధసెంచరీల సాయంతో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ ప్రారంభంలో తడబడినా జెమీమా రోడ్రిగ్స్ (127), హర్మన్‌ప్రీత్ కౌర్ (89) 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. జెమీమా చివరి వరకు క్రీజులో నిలబడి కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. ఇది ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన రన్ ఛేజ్ కావడం గమనార్హం.
8. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం (ప్రపంచ ఛాంపియన్)
ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొంది. షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87) ఆధిపత్య బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) సహకారంతో భారత్ స్కోరును 298/7కి చేర్చింది. బౌలింగ్‌లో మళ్లీ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన చేసి 5 వికెట్లు తీసింది. షెఫాలీ వర్మ కూడా 2 కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే పరిమితమైంది. తద్వారా అన్ని సవాళ్లను అధిగమించి భారత మహిళల జట్టు ప్రపంచ కప్ ఛాంపియన్‌గా అవతరించింది.