
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ మృతితో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే షేన్ వార్న్ మృతి చెందిన సమయంలో ఏం జరిగిందనే విషయాలను తాజాగా థాయిలాండ్ పోలీసులు వెల్లడించారు. వార్న్‌ను కాపాడడానికి అతని ముగ్గురు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం షేన్ వార్న్ కొంతకాలంగా తన ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్ విల్లాలో బస చేస్తున్నారు. శుక్రవారం షేన్ వార్న్ భోజనానికి రాకపోవడంతో ఓ స్నేహితుడు అతని గదికి వెళ్లి చూశాడు. అక్కడ షేన్‌వార్న్ అచేతనంగా పడి ఉండడాన్ని చూసి మిగతా స్నేహితులతో కలిసి వారంతా కాపాడే ప్రయత్నం చేశారు.
గుండె పోటుకు గురై ఉంటాడని భావించి షేన్‌వార్న్ కాపాడడానికి అతని ఛాతి భాగంలో 20 నిముషాలపాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు కూడా సీపీఆర్ నిర్వహించి షేన్ వార్న్‌ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని పోలీసు అధికారులు వివరించారు. షేన్ వార్న్ మృతి పట్ల క్రీడా లోకం సంతాపం ప్రకటించింది. నేడు జరిగిన భారత్- శ్రీలంక, ఆస్ట్రేలియా- పాకిస్థాన్ టెస్టు మ్యాచ్‌లతోపాటు ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో కూడా వార్న్ మృతికి ఆటగాళ్లు సంతాపంగా నిముషం పాటు మౌనం పాటించారు.
15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో షేన్ వార్న్ ఎన్నో మైలు రాళ్లను సాధించారు. తన లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను ముప్ప తిప్పలు పెట్టారు. స్పిన్ బౌలింగ్ అంటే షేన్ వార్నే అనేంతగా క్రికెట్‌ను ఎలారు. కెరీర్లో 145 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. ఇక 194 వన్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు తీశాడు. 55 టీ20 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వెయ్యి వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్న్ తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.