డిఫెండింగ్ ఛాంపియన్, పోలెండ్ స్టార్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్ కొకో గాఫ్‌ను చిత్తుచేసి ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. ఉమెన్స్ సింగిల్స్‌లో గురువారం జరిగిన సెమీస్‌లో గాఫ్‌పై స్వైటెక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 6-2, 6-4 వరుస సెట్లలో గెలిచింది.
తొలి సెట్‌లో టాప్ సీడ్ స్వైటెక్ మూడో సీడ్ గాఫ్‌పై పైచేయ సాధించింది. గాఫ్ పుంజుకోకుండా పాయింట్లతో సత్తాచాటింది. అయితే రెండో సెట్‌లో గాఫ్ ప్రతిఘటన చూపించింది. అంత సులువుగా అమెరికా ప్లేయర్ ఓటమి ఒప్పుకోలేదు. మరో సెమీఫైనల్‌లో ఇటలీ స్టార్ జాస్మిన్ పౌలీని విజయం సాధించింది. రష్యా యువ సంచలనం మిరా ఆండ్రీవాపై 6-3, 6-1 తేడాతో సునాయాసంగా గెలిచింది.

ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు చేరిన రష్యా టీనేజర్ కీలక పోరులో తడబడింది. కాగా, టైటిల్ పోరులో ఇగా స్వైటెక్‌తో పౌలీని తలపడనుంది. 28 ఏళ్ల పౌలీనికి ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. 2022, 2023 ఫ్రెంచ్ ఓపెన్‌లలో స్వైటెక్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, పురుషుల్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో డిమినర్ (అర్జెంటీనా)పై అలెగ్జాండ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 7-6 (7-5), 6-4తో గెలిచి సెమీస్‌కు చేరాడు.
సెమీఫైనల్‌లో నార్వే ప్లేయర్ రూడ్‌తో జ్వెరెవ్ పోటీపడనున్నాడు. మరో సెమీస్‌లో అల్కరాస్ (స్పెయిన్) - సినర్ (ఇటలీ) అమీతుమీ తేల్చుకోనున్నారు. మరోవైపు పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్‌లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి చుక్కెదురైంది. ఇటలీ ద్వయం సిమోన్ బొలిలీ-ఆండ్రియా వావాసోరి చేతిలో 5-7, 6-2, 2-6తో ఓటమిపాలైంది.