ఉగాండ ప్లేయర్ ఫ్రాంక్ న్సుబుగా సంచలన రికార్డు నమోదు చేశాడు. 43 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2024లో అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కిన ఫ్రాంక్ చరిత్రలో నిలిచేలా అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. గయనా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ మూడు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకు ఆలౌటైంది. హిరి హిరి (15; 19 బంతుల్లో, 2 ఫోర్లు), లెగా సియాక (12; 17 బంతుల్లో, 1 ఫోర్), కిప్లిన్ (12; 20 బంతుల్లో, 1 సిక్సర్) మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరు అందుకోలేదు. ఉగాండ బౌలర్లలో అల్పేష్ రంజానీ, కాస్మస్, జుమా మియాగీ, ఫ్రాంక్ న్సుబుగా తలో రెండు వికెట్లు తీశారు.

43 ఏళ్ల న్సుబుగా నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండు ఓవర్లు మెయిడిన్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యంత ఉత్తమ ఎకానమీ (1.00) బౌలింగ్ ఇదే. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ (2.25) పేరిట ఉండేది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఛేదనలో ఉగాండ 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
అయితే ఉగాండ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రియాజత్ అలీషా (33; 56 బంతుల్లో, 1 ఫోర్), జుమా మియాగీ (13; 16 బంతుల్లో)తో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 35 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఉగాండకు ఇదే తొలి విజయం కావడం విశేషం.
కాగా, ఉగాండ-పపువా న్యూ గినియా మ్యాచ్ ఓ అరుదైన రికార్డు నమోదుచేసింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో అత్యంత తక్కువ రన్ రేటు నమోదైన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో 4.13 రన్‌రేటుతో పరుగులు నమోదయ్యాయి.