
వీడియో తీసి బెదిరింపులు
2019లో భారత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చినట్టు బ్రెండన్ టేలర్ తెలిపాడు. ఆ సందర్భంగా ఆ వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో పాల్గొన్నట్లు చెప్పాడు. ఆ పార్టీలో సదరు వ్యక్తులు తనకు నిషేధిత కొకైన్ ఇచ్చినట్లు తెలిపాడు. తాను కూడా ఆ కొకైన్ తీసుకున్నట్టు అతను చెప్పాడు. ఆ సమయంలో వారు తనకు తెలియకుండా కొకైన్ తీసుకుంటుండగా వీడియో తీసినట్టు చెప్పుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఆరుగురు వ్యక్తులు తన హోటల్ గదికి వచ్చినట్టు తెలిపాడు. తాను నైట్ పార్టీలో కొకైన్ తీసుకుంటుండగా తీసిన వీడియోను చూపించి అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని బెదిరించారని బ్రెండన్ టేలర్ వివరించాడు. ఒకే వేళ తాను ఫిక్సింగ్‌కు పాల్పడకుంటే ఆ వీడియోను బయటికి విడుదల చేస్తామని బెదిరించినట్లు తెలిపాడు.
ఆర్థిక పరిస్థితి ఆసరాగా చేసుకుని ప్రలోభాలు
సదరు వ్యాపారవేత్త తమ దేశమైన జింబాబ్వేలో టీ20 లీగ్‌ను ప్రారంభించినున్నట్లు చెప్పాడని బ్రెండన్ టేలర్ వెల్లడించాడు. అప్పటికీ తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి 6 నెలలుగా జీతాలు అందలేదని చెప్పాడు. దీంతో వాళ్లు తన ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకోని ప్రలోభాలకు దిగడమే కాకుండా బెదిరింపులకు దిగారని తెలిపాడు. అప్పుడు తనకు 15 వేల అమెరికా డాలర్లు ఆఫర్ చేశారని చెప్పాడు. మరో దారి లేక ఆ సమయంలో కొంత డబ్బు కూడా తీసుకున్నట్లు టేలర్ తెలిపాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ప్రస్తుతం ఈ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశానని వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రస్తుతం ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కూడా వెల్లడించినట్లు టేలర్ చెప్పాడు. పర్యావసనంగా ఐసీసీ విధించే నిషేధాన్ని ఎదుర్కొడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే ఆ వ్యాపారవేత్త పేరును మాత్రం టేలర్ వెల్లడించలేదు.

స్పందించిన బీసీసీఐ
టేలర్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌పై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ షబీర్ హుస్సేన్ షేఖడం ఖండ్వావాలా స్పందించారు. ఈ సంఘటన భారత్‌లో జరిగినట్లయితే తాము పూర్తి వివరాలను తెలుసుకుంటామని తెలిపారు. అలాగే ఐసీసీ నుంచి కూడా వివరాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి తమను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు.

టేలర్ రికార్డులు
కాగా 35 ఏళ్ల బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గత ఏడాదే వీడ్కోలు పలికాడు. జింబాబ్వే తరఫున అత్యధికంగా 17 సెంచరీలు చేసిన రికార్డు కూడా టేలర్ పేరు మీదనే ఉంది. 34 టెస్టుల్లో 36 సగటుతో 2320 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 205 వన్డేల్లో 35 సగటుతో 6684 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా 44 టీ20ల్లో 22 సగటుతో 859 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












