
మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి మరో కారును ఢీకొట్టిన కేసులో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. మితిమీరిన వేగంతో కారును నడిపిన 50 ఏళ్ల కాంబ్లీ.. క్రికెటర్ రమేష్ పొవార్ భార్యకు చెందిన కారును తన కారుతో ఢీకొట్టాడు. అలాగే బాంద్రాలోని తాను నివాసం ఉంటున్న రెసిడెన్షిషియల్ గేట్‌ను తన కారుతో ఢీ కొట్టి ధ్వంసం చేశాడు.
ఆ సమయంలో కారులో కాంబ్లీ ఒక్కడే ఉన్నాడు. ఈ విషయంపై వినోద్ కాంబ్లీతో రెసిడెన్షినల్ సొసైటీ వాచ్‌మ్యాన్, స్థానికులకు మధ్య వాగ్వాదం కూడా నెలకొంది. ఆ సమయంలో కాంబ్లీ మద్యం మత్తులో కూడా ఉన్నాడు. దీంతో క్రికెటర్ రమేష్ పొవార్ భార్య పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. లీలావతి ఆసుపత్రి సమీపంలో పోలీసు పెట్రోలింగ్ వ్యాన్‌కు కాంబ్లీ పట్టుబడ్డాడు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆల్కహాల్ స్థాయిని పరీక్షించడానికి మాజీ క్రికెటర్ రక్త నమూనాలను పరిక్షించారు. దానిని బట్టి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (రాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు), 185 (మద్యం తాగి వాహనం నడపడం) కింద అభియోగాలు నమోదు చేసి వినోద్ కాంబ్లీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పోలీసులు వినోద్ కాంబ్లీని బెయిల్‌పై విడుదల చేశారు.
తన కెరీర్‌లో భారత జట్టు తరఫున వినోద్ కాంబ్లీ 17 టెస్టు మ్యాచ్‌లు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 227 పరుగులు. ఇక వన్డేల్లో 32 సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 106 పరుగులుగా ఉంది.