ఆ ఇద్దరు మ్యాచ్ ఫిక్సర్లు!: లంక మాజీ అధ్యక్షుడు సంచలనం

హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1996 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా శ్రీలంక తరఫున తొలిసారి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించాడు.
శ్రీలంకకు వరల్డ్ కప్ అందించిన ఈ మాజీ దిగ్గజ ఆటగాళ్లు జట్టు తరఫున తొలిసారి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని సుమతిపాల చెప్పడం అక్కడి క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి వీళ్లు 15 వేల డాలర్లు తీసుకున్నారని మీడియా సమావేశంలో సుమతిపాల వెల్లడించాడు.
గుప్తా అనే పేరు గల వ్యక్తి నుంచి ఈ ఇద్దరూ 15 వేల డాలర్లు తీసుకున్నారు అని సుమతిపాల చెప్పాడు. అంతేకాదు తాను బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రణతుంగ, డిసిల్వాలపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదని విమర్శలు వచ్చినట్లు కూడా ఆయన తెలిపారు.
గతంలో సుమతిపాల శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రణతుంగ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుమతిపాలతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కొందరు బుకీలతో సంబంధాలున్నాయని ఆరోపించాడు. శ్రీలంక క్రికెట్, బోర్డు ప్రతిష్ట దెబ్బతినడానికి ఆయన అవినీతి పాలనే కారణమని విమర్శించాడు.
నిజానికి రణతుంగ సోదరుడు నిషాంత బోర్డు అధ్యక్ష పదవి కోసం సుమతిపాలతో పోటీ పడ్డాడు. అయితే మే 30న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని నిషాంత కోర్టుకెక్కడంతో ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం అక్కడి క్రీడాశాఖ తాత్కాలిక బోర్డును ఏర్పాటు చేసి క్రికెట్ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications