
హైదరాబాద్: వచ్చే ఏడాది పాకిస్థాన్ పర్యటనకు మార్లిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తన జట్టుని పంపనుంది. ఈ మేరకు బుధవారం మార్లిబోన్ క్రికెట్ క్లబ్ ధృవీకరించింది. ఈ జట్టుకు శ్రీలంక మాజీ ఆటగాడు, ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
2020 ఫిబ్రవరిలో పాక్ పర్యటనలో వెళ్లే ఎంసీసీ జట్టు ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. 2020 ఫిబ్రవరిలో లాహోర్‌కు తమ జట్టును పంపమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ఆహ్వానాన్ని తాము అంగీకరించామని ఎంసిసి ఒక ప్రకటనలో తెలిపింది.
"పాకిస్తాన్ వంటి దేశాలలో క్రికెట్కు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. 2009 యొక్క విషాద సంఘటన నుండి అంతర్జాతీయ క్రికెట్‌ను పాకిస్థాన్ రప్పించడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీబీసీ) అద్భుతమైన పని చేసింది" అని ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర అన్నారు.
2009లో శ్రీలంక బస్సుపై దాడిన ఉగ్రదాడిలో కుమార సంగక్కర గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరుగుతుంది.
రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి కరాచీ వేదికగా ప్రారంభం కానుంది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత ప్రధాన జట్లు ఆ దేశంలో పర్యటించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
శ్రీలంక జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి వెళ్తోన్న సమయంలో ఆ జట్టు ప్రయాణిస్తోన్న బస్సుపై ఉగ్రవాదాలు కాల్పులు జరిపారు. అప్పటి ఉగ్రదాడిలో మొత్తం ఎనిమిది మరణించగా... శ్రీలంక జట్టులోని పలువురు క్రికెటర్లకు గాయలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంసీసీ తమ జట్టును పంపేందుకు సిద్ధమైంది.