క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన కేసులో మాజీ దిగ్గజం, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేననాయకే లొంగిపోయాడు. శ్రీలంక తరఫున అద్భుతంగా రాణించిన అతను.. 2020లో లంక ప్రీమియర్ లీగ్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దుబాయ్ నుంచి పలువురు క్రికెటర్లకు ఫోన్లు చేసిన సేననాయకే.. వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
ఈ విషయంపై శ్రీలంక క్రీడాశాఖకు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ యూనిట్ ముందు సేననాయకే లొంగిపోయాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో సేననాయకేపై కొలంబో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ట్రావెల్ బ్యాన్ కూడా విధించింది. సేననాయకేపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలుపెట్టాలని క్రీడాశాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ను అటార్నీ జనరల్ కోరారు. అప్పుడే కొలంబో కోర్టు.. సేననాయకేపై ట్రావెల్ బ్యాన్ విధించింది.

అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలను సేననాయకే ఖండించాడు. ఇవన్నీ తనతోపాటు తన కుటుంబం పరువు తీయడానికి ఎవరో సృష్టించిన వదంతులని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో శ్రీలంక తరఫున ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడాడు. 2012 నుంచి 2016 వరకు క్రికెట్ ఆడాడు. బంతిపై మంచి కంట్రోల్ చూపించడంలో ఈ ఆఫ్‌స్పిన్నర్ దిట్ట. క్యారమ్ బాల్స్ వేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక దేశవాళీల్లో కూడా సేననాయకే చాలా నిలకడగా రాణించాడు. మొత్తం 112 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అతను 567 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతని అద్భుతమైన కెరీర్ మసకబారిందని సన్నిహితులు బాధ పడుతున్నారు. ఈ కేసు ఫలితం ఎలా ఉంటుందని క్రికెట్ ప్రేమికులు కూడా టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు.