ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీసులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీసులో అతని ఆటతీరు గమనించిన చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా మెచ్యూరిటీతో ఆడుతున్న అతన్ని వెంటనే వన్డే టీంలోకి తీసుకోవాలని అన్నారు.
ఆసియా కప్, వరల్డ్ కప్ ఆడే టీంలో తిలక్ వర్మను తీసుకోవాలని పలువురు మాజీలు డిమాండ్ చేశారు. అయితే మాజీ సెలెక్టర్ సాబా కరీం ఈ డిమాండ్ తప్పన్నాడు. తిలక్ విషయంలో కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అసలు టీ20ల్లో ఒక ప్లేయర్ రాణించడం చూసి, అతన్ని వన్డేలకు ఎంపిక చేయడమే అన్యాయం అని చెప్పాడు.

అలాగే కీలకమైన టోర్నీలకు జట్టును ఎంపిక చేసే సమయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దన్నాడు. వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడే 15 మంది బృందాన్ని ముందుగా సెలెక్టర్లు ఎంపిక చేయాలని సాబా కరీం అన్నాడు. ఆ తర్వాతనే బ్యాకప్ ఆటగాళ్ల గురించి ఆలోచించాలని సలహా ఇచ్చాడు.
గతంలో కొందరు నిపుణుల సలహా మేరకు అంబటి రాయుడును కాదని, విజయ్ శంకర్‌ను వరల్డ్ కప్ టీంలో ఎంపిక చేశారు. ఆ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తొందరపడిన సెలెక్టర్లు వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. కానీ అతను పూర్తిగా తేలిపోయాడు.

ఇప్పుడు తిలక్‌ను వన్డే టీంలోకి తీసుకుంటే అలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాదం ఉందా? అని అడగ్గా.. 'కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓవరాల్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓపిక పట్టాలి. వరల్డ్ కప్ ఆడే 15-18 మందిని జాగ్రత్తగా ఎంపిక చేయాలి. దీనికి ఆసియా కప్ చక్కని వేదికగా ఉంటుంది' అని సాబా కరీమ్ తెలిపాడు.
'కచ్చితంగా వరల్డ్ కప్ ఆడతారనే 15 మందిని ముందుగా సెలెక్టర్లు గుర్తించాలి. ఆసియా కప్ టీంను ప్రకటించే సమయంలో ఈ 15 మందికి మరో ఇద్దరిని కలిపి ప్రకటించాలి. అది కూడా ఆసియా కప్‌కు అంత మంది టీంను ప్రకటించాలి కాబట్టే. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా లేకపోతే.. వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ను కొత్తగా సెలెక్ట్ చేయాలి' అని వివరించాడు.