హైదరాబాద్: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ కోసం ఆదివారం సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులో యువీకి చోటు దక్కలేదు. దీంతో యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్టేనని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
సుమారు మూడు సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది ప్రారంభంలో భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న యువీ చివరిసారిగా వెస్టిండిస్‌తో ఆడిన వన్డే సిరిస్‌లో విఫలమయ్యాడు. దీంతో శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో సెలక్టర్లు యువీని ఎంపిక చేయలేదు.

2019లో జరిగే వరల్డ్ కప్‌ను కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యువరాజ్ ను పక్కన పెట్టింది. బిజీ షెడ్యూల్‌ను ఆధారంగా చేసుకుని సీనియర్ బౌలర్లు అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్‌కు విశ్రాంతినిచ్చారు.
ఇప్పటికే యువరాజ్ 36వ పడికి చేరువవుతున్న నేపథ్యంలో ఇక భారత క్రికెట్ వన్డే జట్టులోకి మరోసారి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో అతడి కెరీర్‌కు దాదాపుగా తెరపడినట్లే అని కూడా భావిస్తున్నారు. కాగా, యువరాజ్ కన్నా వయసులో పెద్దవాడైన మహేంద్ర సింగ్ ధోనీని మాత్రం జట్టులో కొనసాగించాలనే సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.
వెస్టిండీస్ సిరీస్‌లో ఆడిన మరో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ పైనా వేటు పడింది. ఇక విండిస్ పర్యటనకు ఎంపికైన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను లంకతో వన్డే సిరిస్‌కు ఎంపిక చేయలేదు. మరోవైపు గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమైన మనీష్ పాండే పునరాగమనం చేశాడు. చాహల్, శార్దూల్ ఠాకూర్‌లకు మరో అవకాశం దక్కింది.
భారత జట్టు : కోహ్లీ (కెప్టెన్), ధవన్, రాహుల్, రోహిత్ శర్మ, ధోనీ (కీపర్), కేదార్ జాదవ్, మనీష్‌పాండే, హార్దిక్ పాండ్యా, అక్షర్‌పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాగూర్, బుమ్రా, రహానె.