
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అతన్ని పాక్ ప్రభుత్వం పీసీబీ చీఫ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతను అధికారంలో ఉండగా 1.65 కోట్ల పాకిస్తాన్ రూపాయలు ఖర్చు పెట్టి బులెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశాడని వార్తలు వచ్చాయి. ఇలా రజా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విమర్శలకు రమీజ్ రజా సమాధానం చెప్పాడు. రమీజ్ రజా హయాంలోనే పాతికేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఆ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో పాక్ ఓడిపోయింది. ఈ సమయంలో తనకు బెదిరింపులు వచ్చాయని, కొందరు తనను చంపేస్తామని హెచ్చరికలు చేశారని రమీజ్ రజా చెప్పాడు. 'దీనికి సంబంధించిన అన్ని వివరాలు నేను చెప్పకూడదు. కానీ ఇది జరిగినప్పుడు డీఐజీని కూడా కలిశాం. వాళ్ల సలహాతోనే బులెట్ ప్రూఫ్ కారు కొన్నా' అని వెల్లడించాడు.
ప్రస్తుతం ఆ కారు తన వద్ద లేదని, అది పీసీబీ దగ్గరే ఉందని రజా తెలిపాడు. ఆ కారు పీసీబీదే అని, తన తర్వాత వచ్చే చీఫ్ కూడా అది వాడుకోవచ్చునని వివరించాడు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లపై టెస్టు సిరీసుల్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిన తర్వాత పీసీబీపై పాక్ ప్రభుత్వం సీరియస్ అయింది. రమీజ్ రజాను పదవి నుంచి తప్పించి, నజామ్ సేథీ నేతృత్వంలోని 14 మంది కమిటీకి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. పాకిస్తాన్ మాజీ సారధి షాహిద్ అఫ్రిదీని చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. అలాగే రమీజ్ రజా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాకిస్తాన్ జూనియర్ లీగ్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.