Farooq Hameed Passes Away: పాకిస్థాన్‌కు చెందిన మాజీ టెస్ట్ క్రికెటర్ ఫరూఖ్ హమీద్(80) గురువారం దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. ఫరూఖ్ హమీద్ మృతి పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఫరూఖ్ హమీద్ 1964 డిసెంబర్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో తన ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఫరూఖ్ హమీద్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ వికెట్ తీసుకున్నాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఫరూఖ్ హమీద్ 1961-62 నుంచి 1969-70 వరకు 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఫరూఖ్ హమీద్ 25.21 సగటుతో మొత్తం 111 వికెట్లు పడగొట్టాడు. వాటిలో మూడు సార్లు ఐదు వికెట్ల చొప్పున పడగొట్టాడు.
ఫరూఖ్ హమీద్ కెరీర్ ఇలా..
కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఫరూఖ్ హమీద్ 1961-62లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 1963లో పాకిస్థాన్ ఈగల్స్‌తో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1963-64లో ఫరూఖ్ హమీద్ కామన్వెల్త్ లో పాకిస్థాన్ తరఫున రెండు మ్యాచ్ లు ఆడాడు. ఆ సమయంలో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా ఆల్ఫ్ గోవర్ అతడిని గుర్తించాడు. కానీ అతడి బౌలింగ్ లో కచ్చితత్వం లేదని గమనించాడు.

ఫరూఖ్ హమీద్ 1964-65లో పాకిస్థాన్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు. అక్కడ ఫరూఖ్ హమీద్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో తన ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి టెస్ట్ మ్యాచ్ లోనే ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ వికెట్ తీసుకున్నాడు. ఫరూఖ్ హమీద్ 1969-70 వరకు పాకిస్థాన్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం కొనసాగించాడు. కానీ తన దేశం తరఫున ఆడటానికి తగినంత అవకాశాలు రాకపోవడంతో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
ఫరూఖ్ హమీద్ అత్యుత్తమ ఫస్ట్ క్లాస్ బౌలింగ్ 1964-65లో వెల్లింగ్టన్ పై జరిగింది. ఈ మ్యాచ్ లో ఫరూఖ్ హమీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 16 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. వెల్లింగ్టన్ ను కేవలం 53 పరుగులకే ఔట్ చేశాడు. 1967-68లో పెషావర్ తో జరిగిన మ్యాచ్ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తరపున ఆడుతున్నప్పుడు కూడా హమీద్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్‌లో 30 పరుగులకు 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.
ఫరూఖ్ హమీద్ బంధువు ఖలీద్ అజీజ్ కూడా పాకిస్థాన్ లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తర్వాత టెస్ట్ అంపైర్ అయ్యాడు. ఆయన సోదరి తహిరా హమీద్ 1978లో పాకిస్థాన్ ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ను స్థాపించడంలో సహాయపడ్డారు. దాని మొదటి కార్యదర్శిగా కూడా పని చేశారు.
పాక్ ప్రధాని సంతాపం
మాజీ టెస్ట్ క్రికెటర్ ఫరూఖ్ హమీద్ మరణం పట్ల పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ గురువారం విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఫరూఖ్ హమీద్ కుటుంబానికి ప్రధాని హృదయపూర్వక సంతాపం తెలిపారు. క్రీడలలో తన ఆట ద్వారా దివంగత ఫరూఖ్ హమీద్ పాకిస్థాన్ కు గొప్ప గౌరవాన్ని తెచ్చి పెట్టారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.