Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలు కావడంతో ఆ దేశ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ అభిమానుల బాధను ప్రతిబింబించాయి. పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను 'భారత్‌కు పళ్లెంలో పెట్టి ఇచ్చేసింది' అని ఆమిర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
వణుకుతున్న గొంతుతో ఆమిర్ ఆవేదన
మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై తీవ్ర నిరాశతో ఉన్న ఆమిర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఆయన గొంతు వణుకుతూ.. కళ్లు చెమర్చడం కనిపించింది. టీ20 క్రికెట్‌లో పెద్ద స్కోరు ఉంటేనే లక్ష్యాన్ని ఛేదించే జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. ఈ ఓటమిని ఓ పెద్ద అవకాశాన్ని చేజార్చుకోవడంగా ఆమిర్ అభివర్ణించారు.

ఆమిర్ ఏమన్నారంటే:
"యార్, మేం ఈ మ్యాచ్‌ను పళ్లెంలో పెట్టి ఇచ్చేశాం. ఇది చాలా పెద్ద అవకాశం, మేం గెలిచి ఉండాల్సింది. 11-12 ఓవర్లలో 113/1 తో అంత మంచి ఆరంభం లభించింది. ఇద్దరు ఓపెనర్లు సెట్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు. 146 పరుగులను టీ20లలో డిఫెండ్ చేయలేరు, భాయ్." ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేయడం పాకిస్థాన్‌కు దొరికిన మంచి అవకాశమని, కానీ జట్టు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఆయన అన్నారు. టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ ముందు పాకిస్థాన్ ఎంత బలహీనమో నిరూపితమైంది.
విశ్లేషణ సరైందే: 147 సరిపోదు
క్రికెట్ విశ్లేషకులు కూడా ఆమిర్ విశ్లేషణను సమర్థించారు. పాకిస్థాన్ జట్టు 113/1 అనే బలమైన స్థితి నుంచి కేవలం 147 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఇది కొత్త తరం టీ20 క్రికెట్‌లో ఓ పెద్ద వ్యూహాత్మక తప్పిదం. ఒక దశలో భారత్ 20/3 తో కష్టాల్లో ఉన్నప్పటికీ, యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు. "140-150 పరుగుల మొత్తం స్కోర్ల కాలం ఇప్పుడు ముగిసింది" అని ఆమిర్ తన వాదనను బలంగా వినిపించారు. ఈ భావోద్వేగ స్పందన ఈ పరాజయం పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఎంతటి బాధను మిగిల్చిందో తెలియజేస్తుంది.